Site icon NTV Telugu

Ruturaj Gaikwad: సాకులు చెప్పను.. గెలిచినా మేం ఇంకా మెరుగుపడాలి!

Ruturaj

Ruturaj

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 32 పరుగుల తేడాతో గెలిచింది. హ్యాట్రిక్ ఓటముల అనంతరం వరుసగా రెండు మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో కాస్త పైకి వచ్చింది. ఈ విజయంపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితులు మారడం వల్ల తాము లక్ష్యాన్ని సరిగ్గా అంచనా వేసి బౌలింగ్‌లో ప్లాన్‌ను అమలు చేశామని చెప్పాడు. ఫీల్డింగ్‌కు సంబంధించి ఎలాంటి సాకులు చెప్పనని, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని రుతురాజ్‌ స్పష్టం చేశాడు.

సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ మాట్లాడుతూ… ‘నిజం చెప్పాలంటే ఈ విజయంతో చాలా సంతోషంగా ఉన్నాం. ఒక మంచి స్కోర్‌ను డిఫెండ్ చేయగలిగాం. పిచ్ పరిస్థితులను బట్టి చూస్తే అది మంచి స్కోర్ అనిపించింది. మొదటి 7-8 ఓవర్ల తర్వాత వికెట్ పూర్తిగా మారిపోయింది. స్పిన్ అవ్వడం మొదలైంది, బంతి ఆగిపోవడం కూడా ఆగిపోయింది. మొదట మేము 220 లేదా 210 స్కోర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ తర్వాత 190-180 స్కోర్ కూడా సరిపోతుందని భావించాం. పవర్‌ప్లేలో బాగా బౌలింగ్‌ చేయాలనుకున్నాం. ఆ తర్వాత రన్‌రేట్‌ను కంట్రోల్‌లో ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగాం’ అని చెప్పాడు.

Also Read: RCB vs LSG: లక్నో ‘సూపర్ ఫాస్ట్’ వచ్చేశాడు.. ఇక ఆర్‌సీబీకి దబిడిదిబిడే!

‘మా బౌలింగ్ బాగుంది. మెల్లగా జట్టు సమన్వయం మెరుగుపడుతోంది. ప్రతి ఆటగాడికి తన పాత్ర స్పష్టంగా తెలిసింది. ఏ ఓవర్లు వేయాలి, ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలన్నది తెలుసుకున్నారు. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లు అలవాటు పడుతున్నారు. జట్టు క్రమంగా మెరుగుపడుతోంది. ఇది మంచి సూచన. బ్యాటింగ్‌లో అవసరం ఉంటే వీర్‌ను ఉపయోగించాలని అనుకున్నాం. బ్యాటింగ్ బాగా చేశాం కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే బౌలర్‌గా అకీల్‌ను తీసుకొచ్చాం. మధ్యలో ఇద్దరు రైట్ హ్యాండర్లు ఉన్నా.. మంచి ఓవర్లు వేశాడు. నూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫీల్డింగ్‌లో చాలా క్యాచ్‌లు మిస్ అయ్యాయి. ఒకటి రెండు మాత్రమే పట్టుకున్నాం. ఈరోజు వాతావరణం కొంచెం తేమగా ఉంది, చేతులకు చెమట ఎక్కువగా వచ్చింది. ఇది సాకుగా చెప్పలేను. ఫీల్డింగ్‌లో బాగా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. నా ఫామ్‌ పైన ఎలాంటి ఆందోళన లేదు. ఫిట్‌నెస్‌, మానసికంగా బాగున్నా. ఒకే ఒక్క పెద్ద ఇన్నింగ్స్‌ ఆడితే అన్నీ కుదురుకుంటాయి. జట్టులోని ఇతర ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు’ అని రుతురాజ్‌ చెప్పుకొచ్చాడు.

 

Exit mobile version