RR vs RCB: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఆర్‌సీబీదే.. విజయ్ మాల్యా జోస్యం!

Rcb Won

Rcb Won

Vijay Mallya Tweets Ahead of RR vs RCB Eliminator: ఐపీఎల్‌ 2024లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు ఢీకొట్టనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దాంతో రాజస్థాన్‌, బెంగళూరు మ్యాచ్‌పై అందరి కళ్లు ఉన్నాయి. లీగ్ దశలో చివరి ఆరు మ్యాచ్‌లలో గెలిచి అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చిన బెంగళూరు గెలవాలని ఫాన్స్ అందరూ కోరుకుంటున్నారు. మాజీ వ్యాపారవేత్త, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యజమాని విజయ్ మాల్యా ఆర్‌సీబీ గెలుస్తుందని జోస్యం చెప్పాడు.

విజయ్ మాల్యా తన ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశాడు. ‘నేను ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కోసం వేలం వేసినప్పుడు విరాట్ కోహ్లీతో పాటు చాలా మందిని తీసుకున్నా. నేను విరాట్ కోసం వేలం వేసినప్పుడు అతడి కంటే మెరుగైన ఎంపిక లేదని నా మనస్సు చెప్పింది. ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఆర్‌సీబీకి మంచి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. టోర్నీలో ఆర్‌సీబీ జర్నీ ముందుకు సాగాలని కోరుకుంటున్నా. జట్టుకు నా శుభాకాంక్షలు’ అని విజయ్ మాల్యా పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Team India Coach: సూటిగా, సుత్తిలేకుండా చెప్తాడు.. టీమిండియా కోచ్‌గా అతడే బెస్ట్‌ ఆప్షన్‌!

అంతకుముందు చెన్నైని ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాదించినపుడు కూడా విజయ్ మాల్యా బెంగళూరు జట్టుకు అభినందనలు తెలిపాడు. ‘ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినందుకు ఆర్‌సీబీకి అభినందనలు. ఆరంభంలో నిరాశాజనకంగా ఉన్నప్పటికీ.. వరుస విజయాలతో ఈ స్థాయికి చేరుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ట్రోఫీని గెలవడమే మిగిలి ఉంది’ అని లిక్కర్ కింగ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న విజయ్ మాల్యా.. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టు గెలిచినా, ఓడిపోయినా ట్వీట్ల ద్వారా ఉత్సాహపరుస్తున్నాడు. భారత బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్‌ విజయ్‌ మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.