Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్‌కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్..!

Rohit Sharma Vs Jasprit Bum

Rohit Sharma Vs Jasprit Bum

Rohit Sharma vs Jasprit Bumrah: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్‌లో నాయకత్వ మార్పులపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రోహిత్ శర్మ మరోసారి జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రోహిత్ శర్మకు డిప్యూటీగా, అంటే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాలంటూ ఫ్రాంచైజీ ఇచ్చిన ఆఫర్‌ను బుమ్రా తిరస్కరించినట్లు సమాచారం. దీంతో అతను భవిష్యత్తులో ముంబై జట్టును వీడతాడా? అనే చర్చ మొదలైంది.

రోహిత్, సూర్యకుమార్, తిలక్‌లను పక్కనపెట్టి రోహిత్‌కే పగ్గాలు
ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ ఎంపికలో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. అయితే చివరకు రోహిత్ శర్మకే నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ అందించిన సూర్యకుమార్ యాదవ్‌ను కూడా కెప్టెన్సీకి ఎంపిక చేయలేదు. మరోవైపు భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న తిలక్ వర్మను భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

బుమ్రాకు కెప్టెన్సీ కాదు.. వైస్ కెప్టెన్సీ ఆఫర్!
ముంబై ఇండియన్స్‌కు ప్రస్తుతం అధికారికంగా నియమిత వైస్ కెప్టెన్ లేరు. గత సీజన్‌లో హార్దిక్ పాండ్యా అందుబాటులో లేని సమయంలో సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వేర్వేరు సందర్భాల్లో జట్టుకు నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన బుమ్రాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంచైజీ భావించింది. అక్టోబర్ మొదటి వారంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం బుమ్రాను సంప్రదించి రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉండాలని కోరినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను బుమ్రా సున్నితంగా తిరస్కరించినట్లు ఇండియా టుడే కథనం వెల్లడించింది. అయితే ఆయన ఈ ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించారనే విషయం మాత్రం బయటకు రాలేదు.

రూ.18 కోట్లకు అట్టిపెట్టుకున్న స్టార్ బౌలర్!
2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ బుమ్రాను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సైతం ఫ్రాంచైజీతో కొనసాగేందుకు తమ పారితోషికాల్లో కోతకు అంగీకరించినట్లు కథనంలో పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆటగాడికి నాయకత్వ బృందంలో కీలక బాధ్యతలు దక్కకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2026 సీజన్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో బుమ్రా సరదాగా స్పందిస్తూ.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ కాకముందే తాను టెస్ట్ కెప్టెన్ అవుతానని అనుకోలేదని వ్యాఖ్యానించారు.

2013 నుంచి ముంబైతో అనుబంధం.. 187 వికెట్లు!
జస్ప్రీత్ బుమ్రా 2013లో తన 19 ఏళ్ల వయసులో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి తన అద్భుతమైన బౌలింగ్‌తో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇప్పటివరకు 14 ఐపీఎల్ సీజన్లలో 187 వికెట్లు పడగొట్టి ముంబై విజయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

2028 మెగా వేలంలో జట్టును వీడతాడా?
రోహిత్ శర్మకు ఆటగాళ్లను సమన్వయం చేయడంలో మంచి అనుభవం ఉంది. దీంతో కనీసం మరో రెండు సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉందని కథనంలో విశ్లేషించారు. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలో బుమ్రా 32 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టనున్నాడు. ముంబై ఇండియన్స్ నాయకత్వ బృందంలో తనకు కీలక బాధ్యతలు దక్కకపోవడం నేపథ్యంలో బుమ్రా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 2028 ఐపీఎల్ మెగా వేలం సమయంలో మరో ఫ్రాంచైజీకి వెళ్లాలని ఆలోచిస్తాడా? లేక ముంబైతోనే కొనసాగుతాడా? అనేది చూడాలి. అయితే ప్రస్తుతానికి బుమ్రా జట్టును వీడతాడనే అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మొత్తంగా ఓ వైపు హిట్‌ మ్యాన్‌ రీ ఎంట్రీ.. బుమ్రా ఔట్‌ ఒకేసారి అవుతాయనే అనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది..