RCB Captain Faf du Plessis on Virat Kohli’s Noball Dismissal: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వివాస్పద రీతిలో ఔట్ అయిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా వేసిన స్లో ఫుల్‌టాస్‌ను అంచనా వేయలేక.. బంతిని అక్కడే గాల్లోకి లేపగా బౌలర్ క్యాచ్ పట్టాడు. అంపైర్ అవుట్ ఇవ్వగా.. బంతి నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని విరాట్ రివ్యూ కోరాడు. రీప్లేలో చూసిన తర్వాత విరాట్ క్రీజు బయట ఉన్నాడని, బంతి నడుం కంటే తక్కువ ఎత్తులోనే వచ్చిందని థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఇది నెట్టింట పెద్ద చర్చనీయాంశం అయింది.
విరాట్ కోహ్లీ ఔట్‌పై ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ ఔట్ విషయంలో నిబంధనలు వేరేలా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మనమేం చేయలేం. అయితే బంతి మాత్రం నడుంపైకి వస్తున్నట్లు అనిపించింది. థర్డ్ అంపైర్ మాత్రం క్రీజ్‌ను బేస్ చేసుకుని నిర్ణయం తీసుకున్నాడు. ఓ జట్టుకు ఇది సరైంది అనిపించినా, మరో జట్టుకు సరైంది కాదనే అభిప్రాయం ఉంటుంది. ఆటలో ఇవన్నీ సహజమే. నిబంధనలను ఎవరూ అతిక్రమించలేరు కదా?’ అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
Also Read: Virat Kohli-Umpires: సహనం కోల్పోయి.. అంపైర్‌లపై నోరుపారేసుకున్న విరాట్ కోహ్లీ (వీడియో)!
ఫాఫ్ డుప్లెసిస్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ… ‘కోల్‌కతాపై చివరి వరకూ పోరాడి ఒక్క పరుగుతో ఓడిపోవడం చాలా నిరుత్సాహానికి గురి చేసింది. అయితే మా జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉన్నా. ఈ సీజన్‌లో పెద్దగా రాణించని బౌలింగ్ విభాగం ఈ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. భారీ లక్ష్య ఛేదనలో మంచి ఆరంభం దక్కినా స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకున్నాం. రజత్ పటీదార్, విల్ జాక్స్ భాగస్వామ్యం మేం ముందుండేలా చేసింది. సునీల్ నరైన్ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నరైన్ వంటి బౌలర్‌ను అడ్డుకోవాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కష్టమే. కోల్‌కతాను భారీ స్కోరు చేయకుండా మా బౌలర్లు అడ్డుకున్నారు. ఆర్‌సీబీకి ఉన్న పెద్ద సానుకూలాంశం అభిమానుల మద్దతు. వారిని సంతోష పెట్టడానికి చివరివరకూ ప్రయత్నిస్తాం’ అని చెప్పాడు.