RCB vs GT Qualifier 1: మళ్లీ అలానే ఆడతాం.. గుజరాత్‌కు ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ హెచ్చరిక!

  • ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్‌
  • ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • గిల్ సేనకు పరోక్ష హెచ్చరిక
Rajat Patidar Rcb

Rajat Patidar Rcb

RCB Captain Patidar Sends Strong Warning to GT: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు మీడియాతో మాట్లాడిన పాటీదార్.. ఈ సీజన్‌లో బౌలర్ల పరిస్థితి ఎంత కఠినంగా ఉందో వివరించాడు. భారీ స్కోర్లు నమోదవుతున్నప్పటికీ.. ఆర్సీబీ మాత్రం తమ అటాకింగ్ మైండ్‌సెట్‌ను మార్చబోదని స్పష్టం చేశాడు. అదే విధంగా పవర్‌ప్లేలో వికెట్లు తీయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పి.. గిల్ సేనకు పరోక్ష హెచ్చరిక పంపాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో 220-250 పరుగుల స్కోర్లు కూడా సేఫ్ కాదని రజత్ పాటీదార్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు, చిన్న బౌండరీలు, డ్యూ ప్రభావం కారణంగా బౌలర్లకు పరిస్థితులు చాలా కఠినంగా మారాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు చిన్న పొరపాటు చేసినా అది నేరుగా సిక్సర్‌గా మారుతోందని చెప్పాడు. అయినప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నా వాటికి తగ్గట్టుగా ఆడటమే తమ పని అని తెలిపాడు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, జీటీ మధ్య పోరు సమాన బలాల మధ్య జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. లీగ్ దశలో ఇరు జట్లు 18 పాయింట్లతో సమానంగా ముగించాయని గుర్తు చేశాడు. మ్యాచ్ రోజున ఒత్తిడిని ఎవరు బాగా ఎదుర్కొంటారో.. తమ ప్రణాళికలను ఎవరు మెరుగ్గా అమలు చేస్తారో వారే గెలుస్తారని తెలిపాడు.

ఆర్సీబీ బౌలింగ్‌పై కూడా పాటీదార్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘మా బలం బౌలింగ్. పవర్‌ప్లేలో ఎలా బౌలింగ్ చేస్తామనేది చాలా కీలకం. మేము డిఫెన్స్ ఆడేందుకు రాలేదు, అటాక్ చేయడానికే వచ్చాం. ఆరంభంలోనే వికెట్లు తీసే ప్రయత్నం చేస్తాం. ఈ సీజన్ మొత్తం అదే విధంగా ఆడుతున్నాం. క్వాలిఫయర్-1లో కూడా అటాకింగ్ గేమ్ ఆడతాం. భువనేశ్వర్ చాలా సీనియర్ బౌలర్. అతడికి తన బలాలు బాగా తెలుసు. ముఖ్యంగా జూనియర్ బౌలర్లతో మాట్లాడే తీరు, జట్టులో అతడి ప్రెజెన్స్ చాలా ముఖ్యమైనవి’ అని ప్రశంసించాడు. ధర్మశాలలో జరగబోయే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆర్సీబీ అటాకింగ్ గేమ్ కొనసాగిస్తుందా? లేదా జీటీ తమ బౌలింగ్ బలంతో బెంగళూరును నిలువరించగలదా? అన్నది చూడాలి.