Rajasthan Royals Spinner Adam Zampa Ruled Out of IPL 2024: ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 నుంచి తాను తప్పుకొన్నట్లు ప్రకటించాడు. గతేది కాలంగా నిరంతర క్రికెట్ ఆడుతున్నానని, శరీరం కొంత విశ్రాంతి కోరుకుంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జంపా తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024పై దృష్టి సారించడానికి ఈ విశ్రాంతి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. వచ్చే జూన్‌లో వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023 ఆస్ట్రేలియా గెలవడంతో జంపా కీలక పాత్ర పోచించిన విషయం తెలిసిందే.
విల్లో టాక్ పోడ్‌కాస్ట్‌తో ఆడమ్ జంపా మాట్లాడుతూ… ‘ఈ సంవత్సరం ఐపీఎల్ ఆడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది ప్రపంచకప్ సంవత్సరం. ఈ ఏడాది చాలా ముఖ్యమైనదిని నేను భావిస్తున్నాను. గత ఏడాది పూర్తి ఐపీఎల్ ఆడాను. భారత్‌లో వన్డే ప్రపంచకప్ కోసం మూడు నెలలు ఉన్నాను. చాలా అలసి పోయాను. అయినా ఈ సంవత్సరం ఐపీఎల్ ఆడాలనుకున్నా. కానీ రాజస్థాన్ రాయల్స్‌కు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేనని అర్ధమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపాడు.
Also Read: Rajamouli-Rama Dance: ఆల్‌టైమ్ హిట్ పాటకు రాజమౌళి, రమ డ్యాన్స్.. రిహార్సల్ వీడియో వైరల్!
‘టీ20 ప్రపంచకప్‌కు సిద్ధం కావడానికి ఐపీఎల్ 2024 ద్వారా నాకు 14 గేమ్‌లు ఉన్నాయి. అయితే తుది జట్టులో ఉన్న పోటీ కారణంగా నేను ఎన్ని గేమ్‌లు ఆడుతానో తెలియదు. అందుకే ఐపీఎల్ 2024 ఆడడం కన్నా.. నేను నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం, నా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిదని నిర్ణయించుకున్నా. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. ఎందుకంటే తదుపరి సీజన్ ఆడేలోపు ఏం జరుగుతుంది, ఫాన్స్ స్వాగతిస్తారా? అన్న ప్రశ్నలు మనస్సులో మెదిలాయి. టీ20 ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆడమ్ జంపా చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ రూ. 2.25 కోట్లకు జంపాను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023లో అతడు 6 మ్యాచ్‌లు ఆడాడు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్ జట్టులో ఉండడంతో తుది జట్టులో స్థానం కోసం పోటీ పడవలసి వచ్చింది.