Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!

  • రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు
  • ఐపీఎల్‌ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్
  • 220కి పైగా లక్ష్యాలను అత్యధికసార్లు ఛేజ్ చేసిన జట్టు ఆర్ఆర్
Rajasthan Royals Record

Rajasthan Royals Record

Most times successfully chasing 220+ in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) చరిత్రలోనే రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో 220కి పైగా లక్ష్యాన్ని అత్యధికసార్లు విజయవంతంగా ఛేజ్ చేసిన జట్టుగా ఆర్ఆర్ నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో రాజస్థాన్ ఖాతాలో ఈ అరుదైన రికార్డు చేరింది. ఇప్పటివరకు ఆర్ఆర్ నాలుగు సార్లు 220+ టార్గెట్లను ఛేజ్ చేసి ప్రత్యేక రికార్డు నెలకొల్పింది.

ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మూడు సార్లు 220కి పైగా లక్ష్యాలను ఛేజ్ చేసి రెండో స్థానంలో ఉన్నాయి. ముంబై ఇండియన్స్ రెండు సార్లు ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట లక్నో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఆర్ఆర్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నోపై సాధించిన విజయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (93; 38 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ధ్రువ్ జురెల్ (53 నాటౌట్‌; 38 బంతుల్లో), యశస్వి జైస్వాల్ (43; 23 బంతుల్లో) కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌తో భారీ లక్ష్యాలను కూడా ఒత్తిడి లేకుండా ఛేజ్ చేసే సామర్థ్యం రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో ఉందని మరోసారి నిరూపితమైంది.

ఐపీఎల్ చరిత్రలో 200కి పైగా లక్ష్యాలను అత్యధికసార్లు ఛేజ్ చేసిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ 11 సార్లు 200+ టార్గెట్లను ఛేజ్ చేసి టాప్‌లో ఉండగా.. ముంబై ఇండియన్స్ 8 సార్లు ఈ ఫీట్ సాధించింది. రాజస్థాన్ 7 విజయవంతమైన 200+ ఛేజింగ్‌లతో మూడో స్థానానికి చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 సార్లు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 5 సార్లు ఈ ఘనత సాధించాయి.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బ్యాటింగ్ ఆధిపత్యం బాగా పెరిగిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు 200 స్కోరు అంటే మ్యాచ్ గెలిచినట్టే భావించేవారు. కానీ ఇప్పుడు 220కి పైగా స్కోర్లు చేసినా కూడా విజయంపై నమ్మకం ఉండడం లేదు. పవర్ హిట్టింగ్, అటాకింగ్ మైండ్‌సెట్‌తో జట్లు భారీ లక్ష్యాలను సైతం సులభంగా ఛేజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు భయంకరంగా మారింది. ఈ క్రమంలోనే రికార్డులు కొల్లగొడుతోంది.