Gujarat Titans Out From IPL 2024 Playoffs Due To Rain: ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ఉన్న గుజరాత్.. సోమవారం నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడాల్సి ఉండగా.. ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. మ్యాచ్ ఆరంభానికి ముందే మొదలైన వర్షం.. రాత్రి 10 గంటలు దాటినా ఆగలేదు. దాంతో ఆట సాధ్యం కాలేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌కు తుది గడువు రాత్రి 10.56 గంటలు కాగా.. 10.30కు వర్షం పడుతుండడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో కోల్‌కతా, గుజరాత్ జట్లకు చెరో పాయింట్ దక్కింది.
ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ప్లేఆఫ్స్ రేసులో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే.. చివరి రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ కచ్చితంగా గెలవాలి. అంతేకాదు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉండేది. కానీ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ రద్దవడంతో.. గుజరాత్ కథ ముగిసింది. చివరి మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లు చేరుతాయి. ఇప్పటికే నాలుగు జట్లు 14 పాయింట్లు సాధించిన నేపథ్యంలో.. టైటాన్స్‌కు దారులు మూసుకుపోయాయి. గుజరాత్ అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది.
Also Read: Game Changer: ‘దేవర’కు పోటీగా గేమ్ ఛేంజర్!
ఇప్పటికే పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కూడా అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించాయి. 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న కోల్‌కతా.. అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా దాదాపుగా ప్లేఆఫ్స్ చేరినట్లే. ప్లేఆఫ్స్ చేరేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా సరిపోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా చివరి మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ చేరుతుంది. లక్నోకు కూడా ఛాన్స్ ఉంది. బెంగళూరు, ఢిల్లీలకు మిణుకుమిణుకుమంటున్న ఆశలు ఉన్నాయి.