ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీష్ రాణా ఔట్ అయిన తీరుపై పెద్ద చర్చ మొదలైంది. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గాలులు బలంగా వీచిన పరిస్థితుల్లో.. చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో రాణా డీప్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే అతడు షాట్ ఆడే ముందు స్టంప్స్‌పై ఉన్న బెయిల్ పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది.
వీడియో చూసిన అభిమానులు ఇది హిట్-వికెట్‌గా పరిగణించాలా? లేదా వికెట్ కీపర్ సంజు శాంసన్ పొరపాటున స్టంప్స్‌ను తాకాడా? అని కామెంట్స్ చేస్తున్నారు. రీప్లేలు చూస్తే.. వికెట్ కీపర్ ఎలాంటి తప్పిదం చేయలేదు. స్టంప్స్‌పై ఉన్న బెయిల్ గాలి వేగం వల్లే పడిపోయి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ఈ ఘటనపై అసలు ప్రశ్న ఏంటంటే.. అంపైర్ డెడ్ బాల్ ప్రకటించాల్సి కదా? అని. మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ రూపొందించిన చట్టాల ప్రకారం.. డెడ్ బాల్ ప్రకటించడానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. లా 20 ప్రకారం బ్యాటర్ దృష్టి మరలిపోయే విధంగా ఏదైనా శబ్దం లేదా కదలిక ఉంటే మాత్రమే అంపైర్ డెడ్ బాల్ ఇవ్వవచ్చు.
ఈ సందర్భంలో బౌలర్ నూర్ అహ్మద్ ఇప్పటికే బంతిని వేయడం పూర్తి చేశాడు. అలాగే బ్యాటర్ నితీష్ రాణాకు ఎలాంటి డిస్ట్రాక్షన్ కూడా కనిపించలేదు. బెయిల్ పడిపోవడం రాణా షాట్ ఆడిన తర్వాత జరిగిందని భావిస్తే.. డెడ్ బాల్ ఇవ్వడానికి కుదరదు. అదేవిధంగా హిట్-వికెట్‌గా ఇవ్వాలంటే బ్యాటర్ తనే స్టంప్స్‌ను తాకాలి. కానీ ఈ సంఘటనలో రాణా స్టంప్స్‌ను తాకిన ఆధారాలు లేవు. అందువల్ల హిట్-వికెట్‌గా కూడా పరిగణించలేము. మొత్తంగా చూస్తే.. రాణా ఔట్‌ను ఫీల్డర్ క్యాచ్‌గా ఇచ్చిన అంపైర్ల నిర్ణయం నిబంధనలకు అనుగుణంగానే ఉంది. అయినప్పటికీ బెయిల్ పడిపోవడం వల్ల వచ్చిన ఈ అనుమానాలు మ్యాచ్ అనంతరం పెద్ద చర్చకు దారితీశాయి.
