Site icon NTV Telugu

Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

Mumbai Indians’ Biggest Blunder

Mumbai Indians’ Biggest Blunder

Did Mumbai Indians’ Biggest Blunder: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో విజయవంతమైన ఫ్రాంచైజీలలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇప్పటికే ఐదుసార్లు టైటిల్ గెలిచింది. ముంబై ప్రాంచైజీ ఐపీఎల్ ఆరంభం నుంచి ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ఆటగాడిగా ఎదగడంలో దోహదపడుతోంది. భారత జట్టుకు కూడా టాప్ స్టార్లను అందించింది. అలాంటి ముంబై జట్టు ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా హిట్టర్ టిమ్ డేవిడ్‌ను వేలంలో వదిలేసి.. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై అతిపెద్ద తప్పిదం చేసిందని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.

2021 ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టిమ్ డేవిడ్‌ను కేవలం రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)పై తన తొలి మ్యాచ్ ఆడిన డేవిడ్ కేవలం 3 బంతుల్లో 1 పరుగే చేసి నిరాశపరిచాడు. ఆసీస్ తరపున దుమ్మురేపడంతో 2022లో రూ.8.4 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కిరన్ పోలార్డ్ స్థానంలో డేవిడ్‌ను భవిష్యత్తు ఫినిషర్‌గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేసింది. పోలార్డ్ కూడా మూడు సంవత్సరాల పాటు డేవిడ్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేశాడు. ఫినిషర్ పాత్రలో ఎలా ఆడాలో, ఒత్తిడిలో ఎలా నిలబడాలో అతడికి మార్గనిర్దేశం చేశాడు. దీంతో భవిష్యత్తులో ముంబైకి డేవిడ్ పెద్ద ఆస్తిగా మారతాడని అభిమానులు భావించారు.

అయితే టిమ్ డేవిడ్‌ ముంబై జట్టు అంచనాలకు తగ్గట్టు ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. దాంతో 2025 సీజన్‌కు ముందు అతడిని వేలంలోకి విడుదల చేసింది. ఇది అందరినీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మళ్లీ ఆర్‌సీబీ డేవిడ్‌ను రూ.3 కోట్లకు దక్కించుకుంది. అప్పటి వరకు సాధారణ ప్లేయర్‌గా కనిపించిన డేవిడ్.. ఇప్పుడు బెంగళూరు తరఫున మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు. 2025లో పర్వాలేదనిపించిన డేవిడ్‌.. ఐపీఎల్ 2026లో రెచ్చిపోయాడు. తాజా మ్యాచ్‌లో సీఎస్‌కేపై కేవలం 25 బంతుల్లో 70 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన అదే ప్రత్యర్థిపై ఇప్పుడు అద్భుత ఇన్నింగ్స్ ఆడటం అతని కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది.

Also Read: RCB-BCCI: ఆర్‌సీబీకి బీసీసీఐ మద్దతు.. అందుకేనా ఈ వరుస విజయాలు?

ఆర్‌సీబీ తరఫున టిమ్ డేవిడ్‌ దూకుడు ఇన్నింగ్స్‌లు, చివరి ఓవర్లలో మ్యాచ్‌లను ముగించే సామర్థ్యం చూసి ముంబై ఇండియన్స్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ‘ముంబై అతడిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయింది’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు భవిష్యత్తు ఆటగాడిగా ముంబై తీర్చిదిద్దితే.. ఇప్పుడు ప్రత్యర్థి జట్టుకు బలంగా మారడం ముంబైకి పెద్ద షాక్‌గా మారింది. ఈ పరిణామం ఐపీఎల్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలు ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది. సరైన సమయంలో సరైన ఆటగాడిని అట్టిపెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇదే మంచి ఉదాహరణ. ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం ఇదే అని నెటిజెన్స్ అంటున్నారు.

 

Exit mobile version