Site icon NTV Telugu

Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్‌, తాజా అప్‌డేట్ ఇదే!

Lungi Ngidi Injury

Lungi Ngidi Injury

Lungi Ngidi Injury Update: ఐపీఎల్ 2026ఓ భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కొట్టిన బంతి గాల్లోకి లేవగా.. దానిని క్యాచ్ పట్టే క్రమంలో ఢిల్లీ పేసర్ లుంగి ఎంగిడి బంతి దిశను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. వెనక్కి అడుగులు వేస్తూ క్యాచ్ కోసం ప్రయత్నించిన తరుణంలో అదుపు తప్పి వెనుకకు పడిపోయాడు. ఈ క్రమంలో అతని తల మైదానానికి బలంగా తగలడమే కాకుండా.. మెడపై కూడా తీవ్రమైన ఒత్తిడి పడింది.

కిందపడిన వెంటనే లుంగి ఎంగిడి నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలోనే ఉండిపోయాడు. కనీసం కదలలేని స్థితిలో ఉన్న అతడిని చూసి తోటి ఆటగాళ్లు, ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అంపైర్లు ఆటను నిలిపివేయగా.. వైద్య సిబ్బంది స్ట్రెచర్‌తో మైదానంలోకి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఎంగిడిని స్ట్రెచర్‌పైనే అంబులెన్స్‌లోకి ఎక్కించి నేరుగా ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం రద్దీ సమయం అయినప్పటికీ అత్యవసర పరిస్థితిల్లో కేవలం 11 నిమిషాల్లోనే అతడిని ఆస్పత్రికి తరలించారు. న్యూఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని పూసా రోడ్డులో ఉన్న బీఎల్‌కే-మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.

సాధారణంగా ట్రాఫిక్ లేని పరిస్థితుల్లో 7.5 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 15-20 నిమిషాలు పడుతుంది. అయితే దేశ రాజధానిలో సాయంత్రం రద్దీ సమయంలో కూడా.. ఎంగిడిని తీసుకుని అంబులెన్స్ స్టేడియం నుంచి కేవలం 11 నిమిషాల్లోనే ఆసుపత్రికి చేరుకుంది. ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఐపీఎల్ నిర్వాహకులు ఎంగిడి ఆరోగ్య పరిస్థితిపై కీలక ప్రకటన చేశారు. ఎంగిడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అవసరమైన పరీక్షల అనంతరం శనివారం రాత్రే అతడిని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. ఈ వార్తతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం, క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తదుపరి మ్యాచ్‌లలో అతను అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 

Exit mobile version