NTV Telugu Site icon

Sunil Narine: సునీల్ నరైన్‌ ఎందుకు నవ్వడు.. కోల్‌కతా ప్లేయర్స్ ఏం చెప్పారంటే?

Sunil Narine Kkr

Sunil Narine Kkr

KKR Players on Sunil Narine Smile: మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ చాలా సీరియస్‌గా ఉంటాడు. ఎప్పుడూ కామ్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. భారీగా రన్స్ ఇచ్చుకున్నా లేదా వికెట్ పడినా ఒకేలా ఉంటాడు. ఎక్కువగా సంబరాలు చేసుకోడు. ముఖంలో ఎలాంటి భావోద్వేగాలూ కనిపించనీయకపోవడంతో ప్రత్యర్థులు కూడా గందరగోళానికి గురవుతుంటారు. దాంతో నరైన్‌ ఎందుకు నవ్వడు అని చాలా మంది మెదడును తొలుస్తుంటుంది. ఈ ప్రశ్నకు కోల్‌కతా ప్లేయర్స్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

సునీల్‌ నరైన్‌ భావోద్వేగాలను కనిపించనీయకపోవడానికి అతడి అనుభవమే కారణమని ఆండ్రీ రస్సెల్‌ అన్నాడు. ‘నరైన్‌ 500 మ్యాచ్‌లు ఆడాడు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కారణంగా తొందరగా మీలో ఉద్రేకం కనిపించదు’ అని రస్సెల్‌ తెలిపాడు. ఫిల్‌ సాల్ట్‌ మాట్లాడుతూ… ‘నరైన్‌ చాలా స్థిరమైన మనిషి. మైదానం బయట చాలా సరదాగా ఉంటాడు. క్రికెట్‌ను ఎంతో ప్రేమిస్తాడు. ఇద్దరు ఆటగాళ్లను కలిపితే అతడితో సమానం’ అని పేర్కొన్నాడు.

Also Read: Sachin Tendulkar: రాత్రిళ్లు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి.. సచిన్ పొరుగింటి వ్యక్తి ఫిర్యాదు!

రఘువంశీ మాట్లాడుతూ… ‘నరైన్‌ డగౌట్లో బాగా నవ్వుతాడు. అందరిపై జోకులు వేస్తాడు. సీరియస్‌గా ఉండటం ఆట వరకే అనుకుంటాను. అతడు లెజెండ్‌. బ్యాట్‌, బాల్‌తో అద్భుతాలు సృష్టించగలడు’ అని తెలిపాడు. బంతితో సంచలనాలు సృష్టించే నరైన్‌.. ఐపీఎల్ 2024లో పూర్తిస్థాయి బ్యాటర్‌గా మారాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి. 183.67 స్ట్రైక్‌రేట్‌తో 461 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాడు. నరైన్‌ ఆటతో కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపు ఖాయమైంది.