Site icon NTV Telugu

KKR Defeats Reasons: వేలం తప్పిదాలు, గాయాలు, అనిశ్చితి.. కేకేఆర్‌ వరుస ఓటములకు ఎన్నో కారణాలు!

Kkr Defeats Reasons

Kkr Defeats Reasons

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వరుస ఓటములను ఎదుర్కొంటోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగింటిలో ఓడిపోయింది. ఆ ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఖాతాలో ఒక్క పాయింట్ ఉన్న కేకేఆర్.. పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. దాంతో కోల్‌కతాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వరుస ఓటముల నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానే కూడా మార్పులు తప్పవని అంగీకరించాడు. కేవలం ఫామ్ లోపమే కాకుండా జట్టు నిర్మాణంలో ఉన్న లోపాలు కూడా బయటపడుతున్నాయి. కేకేఆర్‌ వరుస ఓటములకు కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.

టాప్ ఆర్డర్‌లో లోపం:
కేకేఆర్ టాప్ ఆర్డర్‌లో దూకుడు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అజింక్య రహానే నిలకడగా ఆడుతున్నప్పటికీ.. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడడం లేదు. అతని స్ట్రైక్‌రేట్ బాగున్నా.. మ్యాచ్‌పై ప్రభావం చూపించే ఇన్నింగ్స్‌లు లేవు. మరోవైపు హిట్టర్ ఫిన్ అలెన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నా.. భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. అలెన్ కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం లేదు. ఓపెనింగ్ కోల్‌కతాకు పెద్ద సమస్యగా మారింది.

మిడిల్ ఆర్డర్‌లో అనిశ్చితి:
టాప్ ఆర్డర్ విఫలం కావడంతో మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. రఘువంశీ ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. రింకు సింగ్ ఈ సీజన్‌లో పరుగులు చేయడం లేదు. సునీల్ నరైన్ ఎక్కడ ఎప్పుడు ఆడుతాడో స్పష్టత లేదు. జట్టు మేనేజ్‌మెంట్ పదేపదే కాంబినేషన్ మార్చడం వల్ల కూడా స్థిరత్వం లేకుండా పోయింది. ముఖ్యంగా కామెరూన్ గ్రీన్‌ను నెంబర్ 6లో ఆడించడం పెద్ద తప్పిదం అనే చెప్పాలి. గ్రీన్‌ సాధారణంగా టాప్ ఆర్డర్‌లోనే రాణిస్తాడు. పావెల్ వచ్చేసరికి మ్యాచ్ ఓటమి అంచన ఉంటోంది.

కెమరూన్ గ్రీన్‌పై ఒత్తిడి:
రూ.25.2 కోట్ల భారీ ధరకు తీసుకున్న కెమరూన్ గ్రీన్ ఇప్పటివరకు ఒకటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అతడిపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా అతడిని ఆండ్రీ రస్సెల్‌తో పోల్చితే.. ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

వేలంలో తప్పిదాలు:
కేకేఆర్ ఈ పరిస్థితికి మరో ముఖ్య కారణం వేలంలో చేసిన తప్పిదాలు. ఆండ్రీ రస్సెల్‌ను రిలీజ్ చేయడం, మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను వదిలేయడం జట్టుకు భారీ దెబ్బగా మారింది. అలాగే ఫిల్ సాల్ట్ ను కూడా వదిలేయడంతో టాప్ ఆర్డర్ మరింత బలహీనపడింది. కేకేఆర్ ఈ నిర్ణయాలు జట్టు స్థిరత్వాన్ని దెబ్బతీశాయి.

బౌలింగ్‌లో లోపాలు:
బౌలింగ్‌లోనూ కేకేఆర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముస్తఫిజుర్ రెహమాన్ జట్టులో లేకపోవడం, హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ గాయాలు జట్టును బలహీనపరిచాయి. అలాగే మతీషా పతిరానా అందుబాటులో లేకపోవడం బౌలింగ్ సమస్యను మరింత పెంచింది. సీనియర్ లీడ్ పేసర్ లేకపోవడంతో చివరి ఓవర్లలో పరుగులు కట్టడి చేయడం కష్టంగా మారుతోంది. కోల్‌కతా త్వరగా తప్పిదాలను సరిదిద్దుకుని కొత్త వ్యూహాలతో ముందుకు రాకపోతే.. ఈ సీజన్‌లో తిరిగి పుంజుకోవడం కష్టమే.

కోల్‌కతా తదుపరి మ్యాచ్‌లు:
ఏప్రిల్ 17: గుజరాత్‌, అహ్మదాబాద్‌
ఏప్రిల్ 19: రాజస్థాన్‌, ఈడెన్ గార్డెన్స్‌
ఏప్రిల్ 26: లక్నో, లక్నో

 

Exit mobile version