NTV Telugu Site icon

IPL 2024: నేటి నుంచి ధనాధన్ ఐపీఎల్ స్టార్ట్..

Ipl2024

Ipl2024

ఐపీఎల్‌–2024కు రంగం సిద్ధమైంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడబోతుంది. గత రెండు సీజన్ల తరహాలోనే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. ఇక, లీగ్‌ దశలో 70 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి. అయితే, తుది షెడ్యూల్‌ ప్రకటించకపోయినా.. మే 26వ తేదీన ఫైనల్‌ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై ఐదేసిసార్లు కప్ గెలవగా కోల్‌కతా 2 సార్లు టైటిల్‌ సాధించగా.. దక్కన్‌ చార్జర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్తాన్‌ రాయల్స్, గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల తలో ఒక్కసారి ట్రోఫీ దక్కించుకున్నాయి.

కాగా, చెపాక్‌ స్టేడియంలో మొదటి మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు ఎఆర్‌ రెహమాన్, సోనూ నిగమ్, అక్షయ్‌ కుమార్, టైగర్‌ ష్రాఫ్‌ తదితరులు పాల్గొంటారు. ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీకి సంబంధించిన విశేషాలు చూసేద్దాం.. తాజా సీజన్‌లో పలు టీమ్స్ కు కొత్త కెప్టెన్లు రాగా.. ముంబైకి హర్థిక్ పాండ్యా, హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్, చెన్నైకి రుతురాజ్‌ గైక్వాడ్, గుజరాత్‌కు శుబ్‌మన్‌ గిల్‌ బాధ్యతలు తీసుకున్నారు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రిషభ్‌ పంత్ ఢిల్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ కోల్‌కతా జట్ల పగ్గాలను మళ్లీ చేపట్టారు. కాగా, మిగతా నలుగురు కేఎల్‌ రాహుల్‌ (లక్నో), సంజు శాంసన్ (రాజస్తాన్‌), పాఫ్ డుప్లెసిస్‌ (బెంగళూరు), శిఖర్‌ ధావన్‌ (పంజాబ్‌)లు గత సీజన్‌లాగే ఈసారి కెప్టెన్లుగా కొనసాగుతున్నారు.

Read Also: Bhoothaddam Bhaskar Narayana: నేటి నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాలీవుడ్ సీరియ‌ల్ కిల్ల‌ర్ మూవీ..!

అయితే, ఎనిమిది జట్ల ‘హోం’ వేదికల్లో ఎలాంటి మార్పు లేకపోగా.. ఢిల్లీ తమ తొలి రెండు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడబోతుంది. పంజాబ్‌ కింగ్స్‌ ఈసారి మొహాలిలో కాకుండా ముల్లన్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఛేంజ్ చేసుకుంది. అలాగే, ఈ సీజన్‌లో కొత్తగా రెండు నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఒక ఓవర్లో రెండు బౌన్సర్లు వేసుకోవచ్చు.. ఇక, చెలరేగిపోతున్న బ్యాటర్లను కొంత వరకు నిలువరించేందుకు పేస్‌ బౌలర్లకు ఇది అదనపు బలంగా పని చేయనుంది. ‘స్మార్ట్‌ రీప్లే’ సిస్టంను కూడా తొలిసారి ఐపీఎల్ లో అమలు చేస్తున్నారు. దీని ద్వారా అంపైర్‌ రివ్యూ ఫలితాలను మరింత వేగంగా, కచ్చితంగా అందించే ఛాన్స్ ఉంది. అలాగే, టీవీ అంపైర్, హాక్‌ ఐ ఆపరేటర్‌ కలిసి ఒకే చోట కూర్చునే ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమవుతుంది. గత సీజన్‌లో అమల్లోకి వచ్చిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధన ఈసారి కూడా కొనసాగనుంది. ఐపీఎల్‌ తర్వాత వెంటనే టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో భారత జట్టులో చోటు సంపాదించుకునేందుకు ఈ టోర్నీ ఒక మంచి అవకాశంగా భావించాలి.