Cameron Green Duck Out: ఐపీఎల్ 2026 వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. అతడిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ.25.2 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి గ్రీన్‌ను దక్కించుకుంది. ఈ ధరతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా కామెరాన్ గ్రీన్ రికార్డు సృష్టించాడు.. అయితే, ఇటీవల ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ దిగ్గజం ఆండ్రే రస్సెల్‌కు ప్రత్యామ్నాయంగా KKR గ్రీన్‌ను భావిస్తున్నప్పటికీ, అతడు రస్సెల్ బ్యాటింగ్ చేసిన స్థానంలో కాకుండా మరో రోల్‌లో ఆడనున్నాడు.
అయితే, ఐపీఎల్ 2026 వేలం సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన KKR హెడ్ కోచ్ అభిషేక్ నాయర్.. కామెరాన్ గ్రీన్ టాప్–3లో బ్యాటింగ్ చేస్తాడని స్పష్టం చేశారు. గత రెండు సీజన్లలో ఓపెనర్‌గా రాణించిన సునీల్ నరైన్ ఈసారి ఓపెనింగ్ చేయడని వెల్లడించారు. దీంతో KKR బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు, ESPN క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన KKR సీఈఓ వెంకీ మైసూర్, గ్రీన్‌ను దక్కించుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీన్ ధర మరింత పెరిగి ఉంటే మిగతా వేలంపై ప్రభావం పడే ప్రమాదం ఉన్నందున అతడిని వదిలేసేవాళ్లమని పేర్కొన్నాడు.
Read Also:
ఇక, బ్యాట్, బాల్ రెండింటితోనూ జట్టుకు విలువైన ఆటగాడిగా కామెరాన్ గ్రీన్ నిలుస్తాడని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ లో అనుభవం ఉన్న యువ ఆల్‌రౌండర్ కావడం, భవిష్యత్తు దృష్ట్యా కూడా KKRకు గొప్ప ఆటగాడిగా మారతాడని తెలిపారు. మొత్తంగా గ్రీన్ రాకతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2026 సీజన్‌కు మరింత బలంగా సిద్ధమైందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోవైపు, ఐపీఎల్ ముగిసి 24 గంటలు గడవక ముందే కామెరాన్ గ్రీన్ డకౌట్ కావడం గమనార్హం. ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ మూడో టెస్టులో కేవలం 2 బంతులే ఎదుర్కొని ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ పెట్టిన రూ. 25. 2 కోట్లకు గ్రీన్ న్యాయం చేస్తారా లేదా అనే దానిపై విభిన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ అంశంపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్.
