Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..

New Srh Batter Salil Aarora

New Srh Batter Salil Aarora

క్రికెట్ ప్రపంచంలో రాత్రికి రాత్రే స్టార్లు పుట్టుకొస్తుంటారు. కానీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక యువకుడు సృష్టించిన ప్రకంపనలు మాత్రం అసాధారణం. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి దిగ్గజ బౌలర్లు ఉన్న ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అద్భుత విజయాన్ని అందించాడు 23 ఏళ్ల పంజాబ్ యువకిరణం సలీల్ అరోరా.

చివరి రెండు ఓవర్లలో హైదరాబాద్ విజయానికి 11 పరుగులు కావాలి. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి తన రాకను చాటిన సలీల్, ఆపై హార్దిక్ పాండ్యా వేసిన 18వ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 10 బంతుల్లోనే 30 పరుగులు (నాటౌట్) సాధించి, ఐపీఎల్ చరిత్రలోనే వాంఖడేలో అత్యధిక రన్ ఛేజ్ రికార్డును నెలకొల్పాడు. ట్రావిస్ హెడ్, క్లాసెన్ వంటి దిగ్గజాలు పునాది వేస్తే, సలీల్ తన మెరుపులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

ఎవరీ సలీల్ అరోరా? 
పంజాబ్ నుంచి వచ్చిన ఈ యువ ఆటగాడు దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటికే తన సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌పై అరంగేట్రంలోనే సెంచరీ బాది ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో.. జార్ఖండ్‌పై కేవలం 45 బంతుల్లో 125 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ టోర్నీలో 198.88 స్ట్రైక్ రేట్‌తో 358 పరుగులు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనే అతనికి సన్‌రైజర్స్ జట్టులో రూ. 1.50 కోట్ల కాంట్రాక్టును తెచ్చిపెట్టింది. నేడు ఆ పెట్టుబడి మాస్టర్ స్ట్రోక్ అని నిరూపితమైంది. కేవలం భారీ షాట్లు ఆడటమే కాదు, ఒత్తిడిలోనూ బుమ్రా వంటి బౌలర్లను ఎదుర్కోగల మానసిక దృఢత్వం సలీల్ సొంతం. ఈ విజయంతో హైదరాబాద్ పట్టికలో మూడో స్థానానికి చేరగా, ముంబైకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఐపీఎల్ వేదికపై ఒక కొత్త నక్షత్రం ఉదయించిందని.. అతనే సలీల్ అరోరాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషి ఖుషీగా ఉన్నారు.