Vaibhav Sooryavanshi: “ఇదే కరెక్ట్ టైమ్.. నిర్ణయం తీసుకోండి”.. వైభవ్ సూర్యవంశీ విషయంలో రెచ్చిపోతున్న అభిమానులు

Vaibhav Sooryavanshi1

Vaibhav Sooryavanshi1

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ భయం తెలియని ఆటతీరుతో మైదానంలో పూనకాలు తెప్పించాడు. నాకౌట్ మ్యాచ్ అనే ఒత్తిడి అస్సలు లేకుండా లెంత్ బాల్స్, షార్ట్ పిచ్ బాల్స్, ఆఖరికి యార్కర్లను సైతం స్టేడియం అవతలికి పంపుతూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా వైభవ్‌పై ప్రేమ కురిపించారు. ఈ బుడ్డోడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తే అనేక మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి ఒక ప్లేయర్ టీమిండియాలో ఉంటే మన జట్టుకు అస్సలు తిరుగు ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వైభవ్ పోస్టులతో నిండిపోయింది. “ఇదే కరెక్ట్ టైమ్” అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.

మరోవైపు.. నిన్న ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును (సురేష్ రైనా రికార్డుతో సమానంగా) అందుకున్నాడు. అంతేకాదు, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (59 సిక్సర్లు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 12 సిక్సర్లు బాదిన వైభవ్, ఈ సీజన్‌లో తన మొత్తం సిక్సర్ల సంఖ్యను 65కు చేర్చుకున్నాడు. సెంచరీ ఖాయం అనుకుంటున్న తరుణంలో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు (5 ఫోర్లు, 12 సిక్సర్లు) చేసి దురదృష్టవశాత్తూ అవుట్ అయ్యాడు. దీనివల్ల క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ఐపీఎల్ శతకం (30 బంతుల్లో) రికార్డును తృటిలో మిస్ చేసుకున్నాడు. అయితే, ఈ ఇన్నింగ్స్ ద్వారా ఈ సీజన్‌లో అతని మొత్తం పరుగుల సంఖ్య 680కి చేరింది. తద్వారా ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ (ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని) ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అతని టీమ్‌మేట్ యశస్వి జైస్వాల్ (626 పరుగులు – 2023 ఐపీఎల్) పేరిట ఉండేది. ఈ క్లాస్ ఇన్నింగ్స్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతనికి వెంటనే భారత జాతీయ జట్టులో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 15 ఏళ్ల వయసులోనే ఇంత పరిణతి, ఫామ్ ఉన్నప్పుడు ‘వేచి చూసే ధోరణి’ కాకుండా, టీమిండియా అతని ఫామ్‌ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు.

×
×
Ad