Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ బౌండరీలతో విరుచుకుపడుతూ దిగ్గజ బౌలర్లను సైతం బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటికే ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్.. శనివారం జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్, కాగిసో రబడలపై విరుచుకుపడ్డాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే తన ఉగ్రరూపాన్ని చూపించాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే తాను ఎదుర్కొన్న తొలి బంతిని లాంగ్-ఆన్ మీదుగా భారీ సిక్సర్‌గా మలచి తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రబడను లక్ష్యంగా చేసుకుని మరో రెండు సిక్సర్లు బాదాడు. మూడో ఓవర్‌లో మళ్లీ సిరాజ్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టినప్పటికీ, అదే ఓవర్‌లో సిరాజ్ అతడిని అవుట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. మొత్తం 16 బంతుల్లో 36 పరుగులు (3 సిక్సర్లు, 3 ఫోర్లు) చేసిన వైభవ్ ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, ఈ పోరులో వైభవ్ సూర్యవంశీ సిరాజ్ దెబ్బకు అల్లాడిపోయాడు. ఒకసారి తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. సిరాజ్ వేసిన ఒక అద్భుతమైన యార్కర్ వైభవ్ కుడి కాలి చీలమండ (Ankle) సమీపంలో బలంగా తాకింది. ఆ దెబ్బకు బుడ్డోడు అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాల్సి వచ్చింది. కాసేపు కుంటుతూనే బ్యాటింగ్ కొనసాగించినప్పటికీ, తన దూకుడును మాత్రం తగ్గించలేదు. ఈ క్రమంలోనే టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా (కేవలం 29 ఇన్నింగ్స్‌ల్లో) 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 514 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకుని, అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ప్రస్తుత 2026 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌ల్లో 40.00 సగటుతో, ఏకంగా 236.55 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
