Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డులతో ఊచకోత కోస్తున్నాడు. జైపూర్‌లో మంగళవారం రాత్రి లక్నో సూపర్ జాయింట్స్ (LSG) విధించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులతో విరుచుకుపడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించడమే కాకుండా, ఎన్నో అరుదైన మైలురాళ్లను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఒక ఐపీఎల్ సీజన్‌లో అతి పిన్న వయసులోనే 500 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. గతంలో 2018లో ఢిల్లీ డెర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున ఆడుతూ 20 ఏళ్ల వయసులో రిషబ్ పంత్ సాధించిన రికార్డును ఈ టీనేజ్ సంచలనం బద్దలు కొట్టాడు. అంతేకాదు, ఒక ఐపీఎల్ సీజన్‌లో కనీసం 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన వారిలో అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించిన ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ 2026 సీజన్‌లో ఏకంగా 236.3 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు. ఈ జాబితాలో 2019లో 204.8 స్ట్రైక్ రేట్ నమోదు చేసిన ఆండ్రీ రస్సెల్ రెండో స్థానంలో ఉండగా, ఇదే 2026 సీజన్‌లో 202.0 స్ట్రైక్ రేట్‌తో అభిషేక్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో నికోలస్ పూరన్ (2025లో 196.2), ట్రావిస్ హెడ్ (2024లో 191.5), గ్లెన్ మాక్స్‌వెల్ (2014లో 187.7), క్రిస్ గేల్ (2011లో 183.1) ఉన్నారు.
ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే క్రమంలో ఒకే ఐపీఎల్ సీజన్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాటర్‌గానూ వైభవ్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ 2026 సీజన్‌లో అతని ఖాతాలో 53 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల ఓవరాల్ లిస్ట్‌లో క్రిస్ గేల్ (2012లో 59 సిక్సర్లు) మొదటి స్థానంలో ఉండగా, వైభవ్ సూర్యవంశీ (2026లో 53 సిక్సర్లు) రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆండ్రీ రస్సెల్ (2019లో 52), క్రిస్ గేల్ (2013లో 51), జోస్ బట్లర్ (2022లో 45), క్రిస్ గేల్ (2011లో 44), అభిషేక్ శర్మ (2024లో 42) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ మరో అరుదైన సిక్సర్ల రికార్డును కూడా సమం చేశాడు. ప్రస్తుత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఓపెనర్ ఫిన్ అలెన్ తర్వాత.. ఒకే ఐపీఎల్ సీజన్‌లో రెండుసార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే, క్రిస్ గేల్, అభిషేక్ శర్మల తర్వాత ఒక ఇన్నింగ్స్‌లో పది కంటే ఎక్కువ సిక్సర్లను ఒకటి కంటే ఎక్కువసార్లు బాదిన మూడో బ్యాటర్‌గా వైభవ్ గుర్తింపు పొందాడు.
క్రిక్ఇన్ఫో (CricViz) డేటా ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్ జట్టు సైతం పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన సరికొత్త ఐపీఎల్ రికార్డును నెలకొల్పింది. ఐపీఎల్ 2026 సీజన్ పవర్‌ప్లేలోనే ఆ జట్టు ఏకంగా 60 సిక్సర్లు బాదింది. ఇందులో ఒక్క వైభవ్ సూర్యవంశీనే 37 సిక్సర్లు కొట్టగా, యశస్వి జైస్వాల్ 12 సిక్సర్లు, జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ కలిసి 11 సిక్సర్లు సాధించారు. గతంలో ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ (2024లో 59 సిక్సర్లు) పేరిట ఉండగా, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ (2025లో 57), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2026లో 54) స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే… రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి లక్నో సూపర్ జాయింట్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు, తమ ఓపెనర్లు జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్ లీ బౌండరీల వర్షంతో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లోనే 10 సిక్సర్లు, 7 ఫోర్లతో 93 పరుగులు చేసి లక్నో బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ కూడా కేవలం 38 బంతుల్లోనే 10 సిక్సర్లు, 7 ఫోర్లతో 53 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీతో రాణించడంతో, రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అత్యంత సులువుగా విజయాన్ని అందుకుంది. ఈ ఘన విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మొత్తం 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది.
