Vaibhav Sooryavanshi: ఆధునిక ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ టీనేజ్ వండర్, తన అరంగేట్రం నుంచే పరుగుల వరద పారిస్తూ సరికొత్త రికార్డులను లిఖించాడు. కేవలం 23 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే 44.70 సగటుతో, ఏకంగా 228.95 స్ట్రైక్ రేట్‌తో 1,028 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రయాణంలో 2 శతకాలు, 6 అర్ధశతకాలతో పాటు 81 ఫోర్లు, 96 సిక్సర్లు బాది అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు సాధించడం అతని కెరీర్‌లో అత్యుత్తమ స్కోరుగా నిలిచింది. ఈ అద్భుతమైన గణాంకాలు, అసాధారణమైన బ్యాటింగ్ శైలి వైభవ్ సూర్యవంశీని ఆధునిక ఐపీఎల్ క్రికెట్‌లో ఒక తిరుగులేని పవర్‌హౌస్‌గా నిలబెట్టాయి.
ఐపీఎల్‌లో ఈ బుడతడు సృష్టించిన చారిత్రాత్మక రికార్డుల గురించి ఇప్పుడు చూద్దాం..
అత్యంత పిన్న వయస్కుడైన ఐపీఎల్ కాంట్రాక్ట్ & ప్లేయర్: కేవలం 13 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ నుంచి రూ. 1.10 కోట్ల భారీ కాంట్రాక్ట్ దక్కించుకుని, ఐపీఎల్ ఒప్పందం కుదుర్చుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ తొలి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత 14 ఏళ్ల 23 రోజుల వయసులో మైదానంలోకి అడుగుపెట్టి, లీగ్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెంచరియన్: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో 38 బంతుల్లో 101 పరుగులు చేసి, పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ సాధించిన అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
భారతీయుల్లో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ: వైభవ్ తన డెబ్యూ సెంచరీని కేవలం 35 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక భారతీయ ప్లేయర్ సాధించిన అత్యంత వేగవంతమైన శతకం ఇదే. మొత్తం లీగ్ చరిత్రలో క్రిస్ గేల్ (30 బంతులు) తర్వాత ఇదే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది.
అత్యంత వేగవంతమైన 1,000 ఐపీఎల్ పరుగులు: పరుగుల వేటలో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తూ, కేవలం 440 బంతుల్లోనే 1,000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీని ద్వారా గతంలో ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన వెయ్యి పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.
ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు: వైభవ్ పవర్ హిట్టింగ్‌లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ ఒకే సీజన్లో అత్యధికంగా 65 సిక్సర్లు బాదాడు. తద్వారా క్రిస్ గేల్ పేరిట ఉన్న సుదీర్ఘకాలపు రికార్డును తుడిచిపెట్టేశాడు.
ఒకే సీజన్‌లో అత్యధిక పవర్‌ప్లే పరుగులు: ఈ బుడ్డోడు ఇన్నింగ్స్ మొదటి ఆరు ఓవర్లలోనే అత్యంత వేగంగా 490 పరుగులు రాబట్టి, 2016లో డేవిడ్ వార్నర్ నెలకొల్పిన 467 పరుగుల రికార్డును అధిగమించాడు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు: అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండానే (Uncapped Player) ఐపీఎల్‌లో ఒకే సీజన్లో 680 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ. దీని ద్వారా తన సహచర ఆటగాడు యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (626) రికార్డును దాటేశాడు.
ఒకే సీజన్‌లో మూడు సార్లు ’10+ సిక్సర్లు’: ఒకే ఐపీఎల్ సీజన్లో మూడు వేర్వేరు ఇన్నింగ్స్‌ల్లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్‌గా లీగ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు ఈ బుడతడు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు: ఒత్తిడితో కూడిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్, ఆ ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 12 సిక్సర్లు బాదాడు.
అత్యంత వేగవంతమైన ప్లేఆఫ్స్ హాఫ్ సెంచరీ: అదే ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే సంయుక్తంగా అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన సొంతం చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ.
