SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..

SRH Playoffs Chances

SRH Playoffs Chances

SRH Lowest Score: నిన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓ పీడకలలా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలిపోయింది. గుజరాత్ బౌలర్ కగిసో రబడ బౌలింగ్‌లో నిప్పులు చెరిగేగాడు. అద్భుతమైన బౌలింగ్‌తో హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు తీసి ఎస్‌ఆర్‌హెచ్ నడ్డి విరిచిన రబడ, తన 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక, ఈ ఘోర పరాజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఎస్‌ఆర్‌హెచ్ నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. 2019లో ముంబై ఇండియన్స్‌పై 96 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తాజాగా ఆ రికార్డును చెరిపేసి మరో చెత్త రికార్డ్‌ను ఖాతాలో వేసుకుంది.

ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ అత్యల్ప స్కోర్లు ఇవే:
86 vs గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్ (2026)
96 vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్ (2019)
113 vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్ (2015)
113 vs కేకేఆర్, చెన్నై (2024 ఫైనల్)
114 vs పంజాబ్ కింగ్స్, దుబాయ్ (2022)

ఇక నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా.. అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి సహా మరో ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఈ భారీ ఓటమి సన్‌రైజర్స్‌ను పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి నెట్టగా, గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. లీగ్ దశ ముగింపునకు చేరువవుతున్న వేళ, రెండు జట్లకు ఇంకా రెండేసి మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ ఓటమి మరిచి ఇక ముందున్న రెండు మ్యాచులపై దృష్టి సారిచాలి.