Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..

Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్.. ఒకప్పుడు కేవలం వన్డే స్పెషలిస్ట్ అనిపించుకున్న ఈ పేరు, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో నిలకడకు నిలువెత్తు రూపంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించడమే కాకుండా, ఫినిషర్‌గానూ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు శ్రేయస్. అయితే, ఈ అద్భుత పరివర్తన వెనుక అయ్యర్‌ను కలిచివేసిన అవమానాలు, విమర్శలు ఉన్నాయనేది ఆసక్తికరమైన అంశం. తనపై వచ్చే విమర్శలనే ఇంధనంగా మార్చుకుని తనను తాను నిరూపించడమే తన లక్ష్యమని అయ్యర్ స్పష్టం చేశాడు.

జియో స్టార్ ‘బిలీవ్’ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యర్.. తన మనసులోని మాటలను పంచుకున్నాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తనకు బలహీనత ఉందన్న విమర్శలపై అతను ఘాటుగా స్పందించాడు. “నీ వల్ల కాదు, ఈ పరిస్థితిలో నువ్వు రాణించలేవు అని ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. అత్యున్నత స్థాయిలో ఆడుతున్న ఒక క్రికెటర్‌గా దాన్ని ఏమాత్రం అంగీకరించలేను. అందుకే నన్ను విమర్శించే వారు తప్పు అని నిరూపించాలని బలంగా నిర్ణయించుకున్నాను” అని అయ్యర్ తెలిపాడు. ఆ కసి ఎంతలా ఉందంటే, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్‌ను అద్భుతమైన సిక్సర్‌గా మలచి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.

వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా అయ్యర్ పట్ల కొందరు ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. “గాయం తర్వాత అయ్యర్ మునుపటిలా ఆడలేడు” అన్న మాటలు అతన్ని మరింత ప్రేరేపించాయి. గాయం తర్వాత మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యమని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని విస్మరించాలి అనే విషయంలో తనకు స్పష్టత ఉందని అతను పేర్కొన్నాడు. షార్ట్ బాల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ వంటి కోచ్‌ల సలహాలు తీసుకుంటూ కఠోరంగా శ్రమించినట్లు తెలిపాడు.

తన ప్రాక్టీస్ సెషన్ల గురించి వివరిస్తూ.. “గతంలో షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీయడానికో లేదా డిఫెన్స్ ఆడడానికో ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నా మైండ్‌సెట్ మారింది. నా జోన్‌లోకి షార్ట్ బాల్ వస్తే కచ్చితంగా సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రాక్టీస్‌లో దాదాపు 300లకు పైగా బంతులను ఎదుర్కొంటాను. సైడ్ ఆర్మ్ త్రోల కంటే కూడా అసలైన బౌలర్లను ఎదుర్కోవడానికే మొగ్గు చూపుతాను. బౌలర్ బంతిని వదిలే ముందే సరైన పొజిషన్‌లోకి రావడం (Rhythm) నేర్చుకున్నాను. ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలలో కనిపించే ఆ రిథమ్‌ను నేను కూడా అలవర్చుకున్నాను” అని అయ్యర్ తన నిలకడ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. విమర్శలే తనను మరింత దృఢంగా మార్చాయని, ప్రస్తుత తన ఫామ్‌కు ఆ కసి ఒక కారణమని పంజాబ్ కింగ్స్ సారథి స్పష్టం చేశాడు.