Site icon NTV Telugu

Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. వరుస వైఫల్యాల తర్వాత తొలి అర్ధశతకం నమోదు చేసిన గైక్వాడ్, జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌తో పాటు అతని ఖాతాలో ఓ అవమానకరమైన రికార్డు కూడా చేరింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించాడు. తొలి నుంచి పరుగులు రావడంలో ఇబ్బంది పడిన అతడు అర్ధశతకం చేరేందుకు 49 బంతులు తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత నెమ్మదైన అర్ధశతకాలు చేసిన బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు.

Read Also: Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని

తరువాత మాత్రం గైక్వాడ్ తన శైలిని మార్చి వేగంగా ఆడాడు. 50 పరుగులు పూర్తయ్యాక గేర్ మార్చిన అతడు బౌండరీలు, సిక్సర్లతో రాణించాడు. చివరకు 60 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యంత నెమ్మదైన అర్ధశతకం రికార్డు జేపీ డుమిని పేరిట ఉంది. అతడు 55 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత పార్థివ్ పటేల్ 53 బంతుల్లో, డుమిని మరోసారి 52 బంతుల్లో, డేవిడ్ వార్నర్, గౌతమ్ గంభీర్ చెరో 50 బంతుల్లో అర్ధశతకాలు సాధించారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ సరసన 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆటగాడిగా గైక్వాడ్ నిలిచాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇది ఆరో అత్యంత నెమ్మదైన అర్ధశతకం కూడా కావడం విశేషం. గతంలో పార్థివ్ పటేల్, మాథ్యూ హేడెన్, మురళీ విజయ్, డ్వేన్ స్మిత్ ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆ క్లబ్‌లో చేరాడు. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కేకు దారుణ ఆరంభం లభించింది. పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సంజూ శాంసన్ 11 పరుగులు, ఉర్విల్ పటేల్ 4 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆరు ఓవర్ల ముగిసే సరికి సీఎస్‌కే స్కోరు 28/3గా నిలిచింది. మధ్య ఓవర్లలో కూడా సీఎస్‌కే ఇబ్బందులు ఎదుర్కొంది. 10 ఓవర్ల తర్వాత స్కోరు 43/4కి చేరింది. ఈ దశలో గైక్వాడ్, శివమ్ దూబే కలిసి ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. దూబే 22 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో కార్తిక్ శర్మ 9 బంతుల్లో 15 పరుగులు, జేమీ ఓవర్టన్ 6 బంతుల్లో 18 పరుగులు చేసి వేగం పెంచారు. దీంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని గుజరాత్ జట్టు సులభంగా ఛేదించి విజయాన్ని అందుకుంది. గైక్వాడ్ హాఫ్ సెంచరీ చేసినా, జట్టుకు విజయం అందించలేకపోయాడు.

Exit mobile version