RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్‌లో తీవ్ర వివాదం.. అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, అనుష్క షాక్.. ఇలా కూడా చేస్తారా అంటూ అసహనం..

Ipl Final

Ipl Final

అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ బ్యాటింగ్ చేస్తుండగా 10వ ఓవర్ చివరి బంతికి ఈ డ్రామా జరిగింది.

జెకబ్ డఫీ వేసిన బంతిని గుజరాత్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఫైన్ లెగ్ వైపు ఆడాడు. అక్కడ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జోర్డాన్ కాక్స్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీనితో సుందర్ అవుట్ అనుకుని పెవిలియన్ వైపు నడవడం ప్రారంభించాడు. అయితే గ్రౌండ్ అంపైర్లు దీనిని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. టీవీ అంపైర్ వేర్వేరు కోణాల్లో పరిశీలించి, క్యాచ్ పూర్తి చేసే క్రమంలో బంతి నేలకు తాకిందని భావించి “నాటౌట్” గా ప్రకటించారు.

×
×
Ad

మైదానంలో అసంతృప్తి..
బిగ్ స్క్రీన్‌పై నాటౌట్ అని రాగానే ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మైదానంలోనే అంపైర్లతో వాదించాడు. ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం చూసి తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యాడు. స్టేడియంలో ఉన్న అతని భార్య అనుష్క శర్మ కూడా ఈ నిర్ణయాన్ని నమ్మలేక షాక్‌లో ఉండిపోయింది. లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ ప్లేయర్ జేసన్ హోల్డర్ పట్టిన ఇలాంటి క్యాచే అవుట్‌గా ఇచ్చారని, ఇప్పుడు మాత్రం నాటౌట్ ఇవ్వడం ఏంటని సోషల్ మీడియాలో అభిమానులు అంపైరింగ్‌ను తప్పుబడుతున్నారు.

అంతకుముందు టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్‌సీబీ పాత జట్టుతోనే బరిలోకి దిగగా, గుజరాత్ జట్టు సాయి కిషోర్ స్థానంలో అర్షద్ ఖాన్‌ను తీసుకుంది. కాగా, రెండు జట్లు కూడా తమ రెండో ఐపీఎల్ టైటిల్ కోసం తలపడుతున్నాయి. గుజరాత్ 2022లో కప్ గెలవగా, ఆర్‌సీబీ గత ఏడాది (2025) తమ తొలి టైటిల్ సాధించి, ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో ఉంది. ప్రస్తుతం గుజరాత్ బ్యాటింగ్ ముగిసింది. 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసిన జీటీ.. ఆర్సీబీకి 156 పరుగుల టార్గెట్‌ ఇచ్చింది.