Pat Cummins: ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్‌కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!

Pat Cummins

Pat Cummins

Pat Cummins: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఓటమితో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు మరో గట్టి షాక్ తగిలింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ పోరులో స్లో ఓవర్ రేట్ కారణంగా కమిన్స్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది మొదటి తప్పిదం కావడంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈ పెనాల్టీ పడింది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ మ్యాచ్ కేవలం 34.5 ఓవర్లలోనే ముగిసినప్పటికీ, నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదన్న కారణంతో బీసీసీఐ ఈ చర్య తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ మ్యాచ్ ఫలితం విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 168 పరుగులు సాధించింది. కానీ, ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు గుజరాత్ పేసర్ల ధాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలారు. పిచ్‌పై ఉన్న అదనపు బౌన్స్‌ను ఉపయోగించుకుంటూ గుజరాత్ బౌలర్లు నిలకడగా హార్డ్ లెంగ్త్ బంతులతో విరుచుకుపడ్డారు. ఇక, తమ జట్టు ఓటమిపై స్పందించిన కమిన్స్.. ప్రత్యర్థి బౌలర్లు వేసినట్లుగా తాము సరైన లెంగ్త్‌లో ఎక్కువసేపు బౌలింగ్ చేయలేకపోయామని అంగీకరించాడు. “నిజం చెప్పాలంటే, ప్రత్యర్థి బౌలర్లు బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. మాకు స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. మా బౌలింగ్ సమయంలోనూ అదే పద్ధతిని ఇంకాస్త ఎక్కువ సేపు కొనసాగించి ఉండాల్సిందేమో అనిపిస్తోంది. వాస్తవానికి ఈ పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉంది. గుజరాత్ బౌలర్లు దాన్ని సంపూర్ణంగా వాడుకున్నారు. టీ20 క్రికెట్‌లో ఇంతకంటే అత్యుత్తమ బౌలింగ్‌ను చూడలేం” అంటూ కమిన్స్ ప్రత్యర్థి జట్టును ప్రశంసించాడు.