Munaf Patel: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌కు ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల గంభీర్ సారథ్యంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టెస్ట్ క్రికెట్ నుంచి బలవంతంగా రిటైర్ చేయించారనే ఆరోపణలను గంభీర్ ఎదుర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ వంటి మూడు ప్రధాన ట్రోఫీలు గౌతమ్ సారథ్యంలోనే వచ్చాయి. కానీ.. టెస్ట్ క్రికెట్‌లో తడబడటంతో కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2011 ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యుడైన మునాఫ్ పటేల్ తన మాజీ సహచరుడికి మద్దతిచ్చారు. గంభీర్‌ను తొలగిస్తే పరిస్థితులు దిగజారవచ్చని హెచ్చరించారు.
“గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వల్ల చాలా మంది అతడిని ఇష్టపడరు. కానీ జట్టు ప్రయోజనాల కోసం ఎంతటి కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీర్‌కు ఉంది. విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ‘నో’ చెప్పడం అంత తేలికైన విషయం కాదు. కేవలం దేశం కోసం కోచ్‌గా సేవలు అందిస్తూ గంభీర్ ఎంతో మంది శత్రువులను కూడగట్టుకున్నాడు. క్రికెట్‌లో మ్యాన్ మేనేజ్‌మెంట్ అనేది అత్యంత కష్టమైన పని. గంభీర్ దానిని సమర్థవంతంగా చేస్తున్నారు.” అని మునాఫ్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.