Kavya Maran: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. అయితే, టోర్నీ నుండి వైదొలిగిన రెండు రోజుల తర్వాత.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తన జట్టు ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్‌తో చాలా సరదాగా, ఆత్మీయంగా మాట్లాడుతుండటం అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి 2016 ఛాంపియన్స్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ 2026 ఐపీఎల్ సీజన్ ఎంతో గుర్తిండిపోయేలా సాగింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాడు, కెప్టెన్ పాట్ కమిన్స్ సీజన్ మధ్యలో జట్టుతో చేరిన తర్వాత సన్‌రైజర్స్ ప్రదర్శన సరికొత్త మలుపు తిరిగింది. అంతకుముందు కమిన్స్ లేని సమయంలో ఇషాన్ కిషన్ జట్టును ఎంతో అద్భుతంగా నడిపించాడు. అతని కెప్టెన్సీలో ఆడిన 7 మ్యాచ్‌లలో 4 విజయాలు, 3 ఓటములతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ రేసులో ముందే నిలిచింది. లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై భారీ విజయం సాధించినప్పటికీ, నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటం వల్ల హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ రెండో స్థానంలో నిలిచి ఉంటే పాట్ కమిన్స్ సేనకు ఫైనల్‌కు వెళ్లడానికి మరో అవకాశం (క్వాలిఫైయర్-2 రూపంలో) దక్కేది, కానీ ఈ సీజన్‌లో వారికి ఆ అదృష్టం లేకపోయింది.
ఇటు ఫ్యాన్స్, అటు ప్లేయర్స్ అందరూ ఎంతో బాధలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ 53 సెకన్ల నిడివి గల ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. “గర్వించదగిన సీజన్ తర్వాత, మేము చిరునవ్వులు, కృతజ్ఞతలతో గర్వంగా తల ఎత్తుకుని వెళ్తున్నాం. రికార్డులు సృష్టించడం, ప్రమాదాలతో తలపడటం, ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం వంటివి అందరికీ లభించవు. సీజన్ ముగిసి ఉండవచ్చు, కానీ మాలోని ఆ నిప్పు ఎప్పటికీ ఆరిపోదు!” అంటూ క్యాప్షన్‌లో ఉంచారు. ఇక ఈ వీడియోలో కావ్యా మారన్ జట్టులోని ఆటగాళ్లతో, కోచింగ్ స్టాఫ్‌తో ఎంతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ కనిపించారు. వీడియో ప్రారంభంలో కావ్యా.. హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్‌లతో చర్చలు జరుపుతూ కనిపించారు. ఆ తర్వాత ఆమె ఇషాన్ కిషన్‌తో కరచాలనం (షేక్‌హ్యాండ్) చేసి, జట్టులోని యువ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లతో నవ్వుతూ ముచ్చటించారు. “ఏం పర్వాలేదు.. నెక్ట్స్ సీజన్‌లో చూసుకుందాం” అనే ధైర్యం నింపి ఉండొచ్చు. అంతేకాదు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి తమ జట్టు కొంపముంచిన రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల వండర్ కిడ్, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న వైభవ్ సూర్యవంశీని కూడా కావ్యా మారన్ ప్రత్యేకంగా అభినందించడం విశేషం. ఈ వీడియోలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కావ్యా మారన్ జట్టు బౌలింగ్ మెంటర్ వరుణ్ ఆరోన్‌తో సుదీర్ఘంగా మాట్లాడటం కనిపించింది. దీన్ని బట్టి చూస్తే వచ్చే సీజన్‌లో కూడా వరుణ్ ఆరోన్ ఈ ఫ్రాంచైజీతోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ క్రేజీ వీడియో చివరిలో కావ్యా మారన్, జట్టు స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్‌తో మాట్లాడుతున్న దృశ్యాలతో వీడియో ముగిసింది. ఓడిపోయినా కూడా జట్టును గుండెల్లో పెట్టుకునే కావ్యా మారన్ నైజం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
We leave with smiles, gratitude, and heads held high after a season to be proud of 👏
Not everyone gets to script records, play with fire and make it to the playoffs. The season may be over, but the FIRE never stops burning! 🧡🔥 pic.twitter.com/udUfTnaFlM
— SunRisers Hyderabad (@SunRisers) May 29, 2026
