Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

ఐపీఎల్ 2026 సీజన్‌లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరపున విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. కేవలం మూడు మ్యాచ్‌లు మినహా, మిగిలిన అన్నింటా ప్రపంచస్థాయి బౌలర్లయిన జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ వంటి దిగ్గజాలను బౌండరీల అవతలికి పంపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన తీరు అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్-5లో ఉన్న ఈ యువ కెరటం, కేవలం ‘బంతిని మాత్రమే చూడు, బౌలర్‌ను కాదు’ అనే మంత్రాన్ని నమ్ముతాడు. 10 మ్యాచ్‌ల్లోనే 237.64 స్ట్రైక్ రేట్‌తో 404 పరుగులు చేయడం అతని సత్తాను చాటుతోంది.

ఈ అసాధారణ ఫామ్‌లో ఉన్న సూర్యవంశీని అడ్డుకోవడం ఏ బౌలర్‌కైనా సవాలేనని చాట్ జీపీటీ పేర్కొంది. అతడిని కట్టడి చేసేందుకు బౌలర్లు వైవిధ్యమైన ప్రణాళికలు అనుసరించాలని సూచించింది. మొదటగా.. అతనికి విడ్త్ ఇవ్వకుండా బాడీ లైన్‌లోకి బంతులు వేయడం ముఖ్యం. హార్డ్ లెంగ్త్ బంతులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూనే, మధ్యలో వేగం తగ్గించిన స్లోయర్ బంతులతో అతని టైమింగ్‌ను దెబ్బతీయాలి. వైడ్ యార్కర్లు వేయడం ద్వారా అతడిని బ్యాట్ చాచి ఆడేలా ప్రేరేపించాలి, తద్వారా పాయింట్ లేదా కవర్ లో క్యాచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను శరీరం వైపు సంధిస్తే, అతను ఇబ్బందికరమైన పుల్ షాట్లు ఆడే ప్రమాదం ఉంది.

స్పిన్నర్లు అయితే బంతిని గాల్లో ఊగిస్తూ ఆఫ్ స్టంప్‌కు వెలుపల వేయాలి, ఇది అతడిని భారీ షాట్లకు ఊరించి మిస్ టైమ్ అయ్యేలా చేస్తుంది. ఒక ఓవర్ ప్రణాళికను గమనిస్తే, మొదటి రెండు బంతులు ఫోర్త్ స్టంప్ ఛానల్‌లో వేసి, ఆ తర్వాత ఒక్కసారిగా లోపలికి వచ్చే బంతిని వేయాలి. నాలుగో బంతిని రిబ్స్ లక్ష్యంగా బౌన్సర్ వేసి, ఐదో బంతిని స్లోయర్ డెలివరీగా సంధిస్తే వికెట్ పడే అవకాశం మెండుగా ఉంటుంది. చివరి బంతిని కాలి వేళ్ల దగ్గరికి యార్కర్‌గా వేస్తే, అప్పటికే వెనుకకు తగ్గిన బ్యాటర్ బౌల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యూహాలతోనే సూర్యవంశీ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ను పవర్‌ప్లేలోనే పెవిలియన్ పంపగలమని చాట్ జీపీటీ వివరించింది.