IPL 2026: ఐపీఎల్ ప్రస్తుత సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ, ముగ్గురు కీలక కెప్టెన్ల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వరుసగా రెండు సీజన్ల పాటు జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమైన అక్షర్ పటేల్, అజింక్యా రహానే, రిషబ్ పంత్‌లు తమ సారథ్య బాధ్యతలను కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించగా, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దాదాపు అదే బాటలో ఉన్నాయి.
ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపిస్తున్న అక్షర్ పటేల్ అటు కెప్టెన్‌గా, ఇటు ప్లేయర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో కేవలం 100 పరుగులు మాత్రమే చేసిన అక్షర్, అందులో ఒకే ఇన్నింగ్స్‌లో 56 పరుగులు సాధించాడు. మిగిలిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 44 పరుగులు మాత్రమే రాబట్టాడు. అటు బౌలింగ్‌లోనూ సరైన పర్ఫామ్ చేయలేకపోయాడు. 12 మ్యాచ్‌ల్లో కేవలం 36 ఓవర్లే వేశాడు. ఈ పరిణామాల నేథప్యంలో ఢిల్లీ మేనేజ్‌మెంట్‌లో వచ్చే ఏడాది మార్పులు జరగనున్నాయి. జెఎస్డబ్ల్యూ (JSW) బాధ్యతలు తీసుకోనున్న తరుణంలో వ్యూహాత్మక నిర్ణయాల కోసం హేమంగ్ బదానీ, వేణుగోపాల్ రావులపై మేనేజ్‌మెంట్ ఆధారపడుతోంది. ఈ సందర్భంగా అక్షర్‌ను కెప్టెన్‌గా కొనసాగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అభిషేక్ పోరెల్ లాంటి ఆటగాడిని పక్కన పెట్టడం, మాధవ్ తివారీని సరిగ్గా వాడుకోకపోవడం, సాహిల్ పరేఖ్‌ను అనవసరంగా ఒత్తిడిలోకి నెట్టడం వంటి నిర్ణయాలు మేనేజ్‌మెంట్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. 2027 మెగా వేలం నాటికి అక్షర్‌ను ప్లేయర్‌గా అంటిపెట్టుకున్నా, నాయకుడిగా మాత్రం అతనికి ఉద్వాసన పలికే సూచనలే ఎక్కువగా ఉన్నాయి.
ఇక, రిషబ్ పంత్ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. లక్నో సూపర్ జెయింట్స్ కోసం సుమారు మూడు మిలియన్ డాలర్లు వెచ్చించిన సంజీవ్ గోయెంకా, ఫలితాల విషయంలో చాలా కఠినంగా ఉంటారు. వరుసగా రెండు సీజన్లు ఫెయిల్ కావడంతో పంత్‌పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. 11 మ్యాచ్‌ల్లో కేవలం 9 సిక్సర్లు మాత్రమే బాదిన పంత్, తన సహజ సిద్ధమైన శైలిని కోల్పోయి ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. జట్టు కూర్పు విషయంలోనూ పంత్ నిర్ణయాలు విమర్శలపాలయ్యాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న అర్షిన్ కుల్కర్ణిని ఓపెనర్‌గా పంపడం, హిమ్మత్ సింగ్, ఆయుష్ బదోనీ వంటి ఆటగాళ్లకు పదే పదే అవకాశాలు ఇవ్వడం జట్టుకు నష్టం చేకూర్చాయి. నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్ ఫామ్ కోల్పోవడం ఒకెత్తయితే, పంత్ వ్యూహాత్మక లోపాలు మరొక ఎత్తు.
ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే జట్టుకు భారంగా మారాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో ప్రత్యామ్నాయం లేక, తన స్నేహితుడు అభిషేక్ నాయర్ కోచ్‌గా ఉండటంతో రహానేకు కెప్టెన్సీ దక్కింది. అయితే, రహానే (133 స్ట్రైక్ రేట్), అంగ్క్రిష్ రఘువంశీ (139 స్ట్రైక్ రేట్) ఇద్దరూ కలిసి టాప్ ఆర్డర్‌లో స్లోగా ఆడటం కేకేఆర్ కొంపముంచింది. వీరిద్దరూ కలిసి 11 మ్యాచ్‌ల్లో కేవలం 25 సిక్సర్లు మాత్రమే కొట్టారు. తన స్ట్రైక్ రేట్ గురించి విమర్శలు వస్తే ఇతరులకు అసూయ అని వ్యాఖ్యానించిన రహానే, 37 ఏళ్ల వయసులో ఆధునిక టీ20 క్రికెట్‌కు తను సరిపోతానా లేదా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అక్షర్, పంత్ కనీసం ప్లేయర్లుగా డిమాండ్‌లో ఉన్నా, రహానేను వచ్చే వేలంలో ఏ జట్టు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపించడం లేదు. కేకేఆర్ ఏదైనా వింత నిర్ణయం తీసుకుంటే తప్ప, రహానే ఐపీఎల్ కెరీర్ ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
