Hardik Pandya: ప్లేఆఫ్స్ నుంచి ముంబై ఔట్.. వైఫల్యాన్ని నిజాయితీ ఒప్పుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya: నిన్న (శనివారం) చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై కేవలం 159 పరుగులు మాత్రమే చేయగా, చెన్నై 19వ ఓవర్‌లో ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టు వైఫల్యాన్ని అత్యంత నిజాయితీగా అంగీకరించాడు. కేవలం ఆ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు, ఈ సీజన్ మొత్తంలోనూ తమ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని స్పష్టం చేశాడు. ప్రత్యర్థి జట్టు అన్ని విభాగాల్లోనూ తమ కంటే మెరుగ్గా రాణించిందని, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ పైచేయి సాధించారని కొనియాడాడు. ఒక దశలో స్కోరు 180 నుంచి 190 వరకు వెళ్తుందని ఆశించామని, కానీ 10 ఓవర్ల తర్వాత ఆ ఊపును కొనసాగించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. సరైన ముగింపు దక్కకపోవడం వల్లే ఆశించిన స్కోరును అందుకోలేకపోయామని వివరించాడు.

మైదానంలో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లు ఆడటం సులభం కాలేదని, సెట్ అయిన బ్యాటర్లు సైతం ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చలాయించలేకపోయారని పాండ్యా పేర్కొన్నాడు. లెక్కలతో కూడిన క్రికెట్ ఆడుతూ, చేతిలో వికెట్లు ఉంచుకోవడంపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. బ్యాటర్లు బంతిని సరిగ్గా హిట్ చేయలేకపోయారని, ప్రత్యర్థి బౌలర్లు అత్యుత్తమంగా బౌలింగ్ చేయడమే ఇందుకు కారణమని చెప్పాడు. ఇక బౌలింగ్ విభాగంలో మరింత దూకుడుగా ఉండాల్సిందన్న ప్రశ్నపై స్పందిస్తూ.. బంతులకు బదులు నిప్పులు కురిపిస్తే తప్ప ఆ వికెట్లు తీయలేమేమో అన్నట్లుగా వ్యంగ్యంగా బదులిచ్చాడు. తమ వద్ద ఉన్న బౌలర్లనే ఉపయోగించుకున్నామని, కానీ ప్రత్యర్థి బ్యాటర్లు ఎంతో తెలివిగా ఆడి గెలిచారని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై తప్పుకుంది. టోర్నీలో మిగిలిన 5 మ్యాచ్‌లకు 5 గెలిచినా ముంబై ఇండియన్స్ ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.