Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ప్రస్థానం ముగిసింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమితో టోర్నీలో వారి ప్రయాణం ముగిసినప్పటికీ, వైభవ్ తన ప్రదర్శనతో భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్పుడు అభిమానులందరి దృష్టి అతని తదుపరి టోర్నీపై పడింది. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే మరో కీలక టోర్నీలో భారత జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జూన్ నెలలో జరగనున్న త్రైపాక్షిక సిరీస్‌కు అతడిని ఇండియా ‘ఏ’ జట్టులో ఎంపిక చేశారు. ఈ టోర్నీలో ఇండియా ‘ఏ’తో పాటు శ్రీలంక ‘ఏ’, ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’ జట్లు కూడా పాల్గొననున్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశంగా భావిస్తున్నారు.
ఇండియా ‘ఏ’ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. జూన్ 9న శ్రీలంక ‘ఏ’తో ఇండియా ‘ఏ’ తొలి మ్యాచ్ ఆడనుండగా, జూన్ 11న ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’తో తలపడుతుంది. అనంతరం జూన్ 15న మరోసారి శ్రీలంక ‘ఏ’, జూన్ 17న ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’తో మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూన్ 21న నిర్వహించనున్నారు.
ట్రై-సిరీస్ షెడ్యూల్
జూన్ 9: ఇండియా ‘ఏ’ vs శ్రీలంక ‘ఏ’
జూన్ 11: ఇండియా ‘ఏ’ vs ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’
జూన్ 13: ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’ vs శ్రీలంక ‘ఏ’
జూన్ 15: ఇండియా ‘ఏ’ vs శ్రీలంక ‘ఏ’
జూన్ 17: ఇండియా ‘ఏ’ vs ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’
జూన్ 19: ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’ vs శ్రీలంక ‘ఏ’
జూన్ 21: ఫైనల్
వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల ఒక సినిమా కథను తలపిస్తోంది. కేవలం 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన అతను, ఆ తర్వాత భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకుని ఆస్ట్రేలియాపై 58 బంతుల్లో శతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చిన్న వయసులోనే అతను చూపించిన నైపుణ్యం భారత క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఐపీఎల్ 2026లో అయితే వైభవ్ తన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతను 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించి అత్యంత విజయవంతమైన యువ ఆటగాడిగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 237.30 ఉండటం అతని దూకుడైన ఆటకు నిదర్శనం. ఈ సీజన్‌లో ఒక శతకం, ఐదు అర్ధశతకాలు నమోదు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. టోర్నీ చివరి దశలో కూడా వైభవ్ తన జోరు కొనసాగించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 97 పరుగులు చేసిన అతను, క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌పై 96 పరుగులతో మరోసారి మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పటికీ, అతని ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు ఐపీఎల్ ముగిసినా, వైభవ్ సూర్యవంశీ ప్రయాణం మాత్రం కొనసాగుతోంది. ఇండియా ‘ఏ’ జట్టుతో జరగబోయే త్రైపాక్షిక సిరీస్‌లో అతను మరోసారి తన ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. భారత క్రికెట్ తదుపరి సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్న ఈ యువ ఆటగాడిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
