Hardik Pandya Poster Sentiment Goes Viral Ahead of RCB vs GT Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండు జట్లు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. ఫైనల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్ చర్చనీయాంశంగా మారింది. అదే.. హార్దిక్ పాండ్య పోస్టర్ సెంటిమెంట్.
ప్రతి ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు టోర్నీ నిర్వాహకులు అన్ని జట్ల కెప్టెన్లతో ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహిస్తారు. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ట్రోఫీతో కలిసి దిగిన ఫొటోను అధికారిక పోస్టర్‌గా విడుదల చేస్తారు. అయితే 2023 నుంచి ఒక ఆసక్తికరమైన ట్రెండ్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పోస్టర్‌లో హార్దిక్ పాండ్య పక్కన నిలిచిన కెప్టెన్ జట్టు ఆ సీజన్‌లో ఐపీఎల్ టైటిల్ గెలుస్తోంది. వరుసగా మూడు సీజన్లుగా ఇదే జరుగుతుండటంతో.. ఈసారి కూడా అదే సెంటిమెంట్ కొనసాగుతుందా అనే చర్చ మొదలైంది.
ఐపీఎల్ 2023 అధికారిక పోస్టర్‌లో హార్దిక్ పాండ్య పక్కన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిలిచాడు. ఆ సీజన్‌లో సీఎస్‌కే అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి.. హార్దిక్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో హార్దిక్ పక్కన నిలిచిన కెప్టెన్ జట్టు టైటిల్ గెలిచిందనే చర్చ మొదలైంది. ఐపీఎల్ 2024 సీజన్ పోస్టర్‌లో హార్దిక్ పాండ్య పక్కన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కనిపించాడు. ఆ ఏడాది కేకేఆర్ అద్భుతంగా రాణించి ఫైనల్‌లో విజయం సాధించి మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దాంతో ఈ సెంటిమెంట్ రెండో ఏడాది కూడా నిజమైంది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో హార్దిక్ పాండ్య పక్కన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ నిలిచాడు. ఆ సీజన్‌లో ఆర్సీబీ చరిత్ర సృష్టిస్తూ.. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. వరుసగా మూడో ఏడాది కూడా ఈ సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో అభిమానులకు దీనిని మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఐపీఎల్ 2026 అధికారిక పోస్టర్‌లో హార్దిక్ పక్కన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. ఇప్పటికే జీటీ ఫైనల్‌కు చేరుకోవడంతో.. ఈ సెంటిమెంట్ మళ్లీ చర్చకు వచ్చింది.
గుజరాత్ అభిమానులు అయితే గత మూడు సీజన్ల ట్రెండ్‌ను చూపిస్తూ.. ఈసారి కూడా టైటిల్ తమ జట్టుదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ అభిమానులు మాత్రం సెంటిమెంట్లు కాదు, మైదానంలో ప్రదర్శనే విజేతను నిర్ణయిస్తుందని అంటున్నారు. నిజానికి ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక సంఘటనలే. ఒక జట్టు టైటిల్ గెలవాలంటే సెంటిమెంట్ల కంటే ఆటగాళ్ల ప్రదర్శన, వ్యూహాలు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యమే కీలకం. అయినప్పటికీ గత మూడు సీజన్లుగా ఈ సెంటిమెంట్ అచ్చుగుద్దినట్టు నిజమవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మరి హార్దిక్ పోస్టర్ సెంటిమెంట్ మరోసారి నిజమై గుజరాత్ ఛాంపియన్‌గా నిలుస్తుందా? లేదా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ గెలిచి కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఈరోజు రాత్రి తేలనుంది.
