Site icon NTV Telugu

Hardik Pandya: హార్దిక్ కెప్టెన్‌ కాకపోయుంటే ముంబై గెలిచేది.. ఎంఐ బుల్లి ఫ్యాన్ ఫైర్!

Mi Hardik Fan

Mi Hardik Fan

ముంబై ఇండియన్స్ అంటే.. ఒకప్పుడు ప్రత్యర్థి జట్లకు వెన్నులో వణుకు పుట్టేది. భీకర బ్యాటింగ్, అంతకుమించి బౌలింగ్ లైనప్‌తో ప్రత్యర్థులను మట్టికరిపించేది. అతి తక్కువ కాలంలో ఐదు ట్రోఫీలు సాధించిన ముంబై.. ఐపీఎల్‌లో ప్రత్యేక ముద్ర వేసింది. అలాంటి ముంబై జట్టు కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో చెత్త ప్రదర్శన చేస్తూ.. అభిమానులను నిరాశపర్చుతోంది. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి.. అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. టాప్ బౌలర్లు ఉన్నా.. 240 పరుగుల భారీ స్కోరును సమర్పించుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్ వంటి మేటి బౌలర్లు జట్టులో ఉన్నప్పటికీ.. బెంగళూరు బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు. ఇది పూర్తిగా కెప్టెన్ హార్దిక్ పాండ్య వైఫల్యమే అని ముంబై ఫాన్స్ అంటున్నారు. మ్యాచ్ అనంతరం ఓ ముంబై బుల్లి ఫ్యాన్ మాట్లాడుతూ.. హార్దిక్ కెప్టెన్‌ కాకపోయుంటే ముంబై ఈ మ్యాచ్ గెలిచేదన్నాడు. బుమ్రా, బౌల్ట్, సాంట్నర్ ఉన్నా.. ముంబై 240 పరుగులు ఇవ్వడం అంగీకరించలేం అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను చర్చకు దారి తీశాయి.

హార్దిక్ పాండ్య స్ట్రైక్ రేట్ మెరుగుపర్చుకోవాలని ఆ ఫ్యాన్ సూచించాడు. బౌలింగ్‌లో వికెట్స్ తీయాలని, కెప్టెన్సీ ఇంకా బాగుండాలని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలో ముంబై హార్దిక్ పాండ్యను రిలీజ్ చేస్తుందని, రోహిత్ శర్మను అట్టిపెట్టుకుంటుందని ఆ అభిమాని చెప్పుకోచాడు. ముంబై కెప్టెన్సీ మార్పు జరిగినప్పటి నుంచి పాండ్యకు ఫ్యాన్స్ నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. రోహిత్ శర్మను కాదని పాండ్యకు పగ్గాలు అప్పగించడంపై ఉన్న అసంతృప్తి, ప్రతి ఓటమితో రెట్టింపు అవుతోంది. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడంలో పాండ్యా విఫలమవుతున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎంఐ బుల్లి ఫ్యాన్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version