Gujarat Titans Escape Major Scare as Team Bus Catches Fire: ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టుకు మరో షాకింగ్ ఘటన ఎదురైంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం జీటీ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది స్పందించడంతో.. ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో బీసీసీఐ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం జీటీ జట్టు బస్సు స్టేడియం నుంచి హోటల్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సులో షార్ట్ సర్క్యూట్ జరగడంతో తొలుత పొగలు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన ప్లేయర్స్.. బస్సు దిగిపోయారు. ఆ తర్వాత బస్సులో మంటలు రేగాయి.
కాసేపు రోడ్డుపైనే వేచి ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు.. మరో బస్సులో హోటల్‌కు వెళ్లిపోయారు. ఈ ఘటన కారణంగా జీటీ ఆటగాళ్లు దాదాపు గంటసేపు రోడ్డుపైనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ మంటలు పెద్ద ప్రమాదానికి దారితీయకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఫైనల్ ఓటమితో నిరాశలో ఉన్న జట్టుకు ఈ ఘటన మరింత ఆందోళన కలిగించింది. గుజరాత్ ఇటీవల వరుస ప్రయాణాలతో బిజీ షెడ్యూల్‌ను ఎదుర్కొంది. మే 27న ధర్మశాల నుంచి ముల్లాన్‌పూర్‌కు చేరుకున్న జట్టు.. మే 29న రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడింది. అనంతరం మే 30న అహ్మదాబాద్‌కు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ.. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణం ఆలస్యమైంది. దీంతో జట్టు శనివారం సాయంత్రం మాత్రమే అహ్మదాబాద్ చేరుకుంది.
ఫైనల్ అనంతరం మీడియాతో మాట్లాడిన గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి.. ఓటమికి అలసటను కారణంగా చూపడానికి తాను ఇష్టపడనని అన్నారు. ‘ఆర్సీబీ అద్భుతంగా ఆడింది. మేము తక్కువ స్కోరుకే పరిమితమయ్యాం. అయినప్పటికీ బౌలర్లు చివరి వరకు పోరాడారు. ఓటమి తర్వాత మేము ఏం తప్పు చేశామో విశ్లేషించుకుంటాం. ప్రత్యర్థి మంచి క్రికెట్ ఆడిందన్న విషయాన్ని అంగీకరించాల్సిందే’ అని చెప్పారు.
