Vaibhav Sooryavanshi: ఏ జట్టు ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు.. రాజస్థాన్ రాయల్స్ రాతను వైభవ్ మారుస్తాడా?

  • చివరి వరకు ఉత్కంఠభరితంగా ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు
  • నాలుగో ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న రాజస్థాన్
  • రాజస్థాన్ రాయల్స్ రాతను వైభవ్ మారుస్తాడా?
Vaibhav Sooryavanshi Rajasthan Royals

Vaibhav Sooryavanshi Rajasthan Royals

Can Vaibhav Sooryavanshi Rewrite IPL History: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి ముంబై ఇండియన్స్‌పై కీలక విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నాలుగో ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా టాప్-4లో చోటు సంపాదించింది. దీంతో ఐపీఎల్ 2026 ట్రోఫీ కోసం పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ మంగళవారం ధర్మశాలలో జరిగే క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతుంది. మరోవైపు బుధవారం ముల్లన్‌పూర్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ క్వాలిఫయర్-2కు చేరుకుంటుంది. క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ పోటీ పడతాయి. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం పోరాడాల్సి ఉంటుంది.

అయితే ఐపీఎల్ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి సవాలు ఎదురుకానుంది. ప్రస్తుత ప్లేఆఫ్స్ ఫార్మాట్ అమల్లోకి వచ్చిన తర్వాత లీగ్ దశలో నాలుగో స్థానంలో నిలిచిన ఏ జట్టు కూడా ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. సాధారణంగా టాప్-2లో ముగించిన జట్లకే ఐపీఎల్ ట్రోఫీ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా రెండో స్థానంలో నిలిచిన జట్లు చాలా సార్లు ఛాంపియన్‌గా అవతరించాయి. గత సీజన్‌లో కూడా ఆర్సీబీ ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి టైటిల్ గెలిచింది.

అయితే ఈ గణాంకాల మధ్య రాజస్థాన్ రాయల్స్ ఆశలు మొత్తం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఐపీఎల్ 2026లో వైభవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 14 మ్యాచ్‌లలో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో 583 పరుగులు సాధించాడు. 41.64 సగటు, 232.27 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్.. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. టీ20 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టీనేజర్‌గా చరిత్ర సృష్టించిన బుడ్డోడు.. ఇప్పుడు రాజస్థాన్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాలనే లక్ష్యంతో ఉన్నాడు. ప్లేఆఫ్స్‌లో కూడా అతడు అదే దూకుడు కొనసాగిస్తే.. రాజస్థాన్ చరిత్రను తిరగరాసే అవకాశం ఉంది.

మరోవైపు ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత రాజస్థాన్ హెడ్ కోచ్ కుమార సంగక్కర జట్టు బౌలర్లను ప్రశంసించాడు. 205 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం సులభం కాదని, కానీ ఒత్తిడి సమయంలో బౌలర్లు అద్భుతంగా రాణించారని తెలిపాడు. ‘చివరి టైమ్‌ఔట్ సమయంలో మా ప్లాన్‌లకు కట్టుబడి ఉండాలని మాత్రమే చెప్పాం. ఒత్తిడిని ఎవరు బాగా ఎదుర్కొంటారనేదే కీలకం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్‌లో కూడా చాలా క్రమశిక్షణగా వ్యవహరించాం’ అని సంగక్కర పేర్కొన్నాడు. ఇప్పుడు ప్లేఆఫ్స్‌లో రాజస్థాన్ ప్రస్థానం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ముఖ్యంగా వైభవ్ మరోసారి తన బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తాడా? లేదా అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.