BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!

  • మంగళవారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం
  • సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై వార్తలు
  • గౌతమ్ గంభీర్ అభిప్రాయమే ఫైనల్
  • టీ20 జట్టు భవిష్యత్ ప్రణాళికలపై కూడా చర్చ
Bcci, Gautam Gambhir, Suryakumar Yadav

Bcci, Gautam Gambhir, Suryakumar Yadav

BCCI Key Meeting on May 19: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయమే సూర్య టీ20 కెప్టెన్సీ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకంగా మారనుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకుమార్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పాటు.. ఇటీవల కాలంలో అతడి ఫామ్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న టెస్టు, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి మంగళవారం (మే 19) గౌహతిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టీ20 జట్టు భవిష్యత్ ప్రణాళికలపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఎంపికయ్యే టీ20 జట్టు గురించి చర్చించనున్నారని సమాచారం. టీ20 వరల్డ్ కప్‌ను సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన తర్వాత జరగనున్న తొలి కీలక సెలక్షన్ మీటింగ్ కావడంతో అందరి దృష్టి ఇప్పుడు దీనిపైనే ఉంది.

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీతో పాటు రిషభ్ పంత్ భవిష్యత్తుపై కూడా బీసీసీఐలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టెస్టు ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న పంత్‌పై సెలెక్టర్లు సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున గత రెండు సీజన్లలో పంత్ నాయకత్వం ఆశించిన స్థాయిలో లేకపోవడం, బ్యాటింగ్‌లో కూడా విఫలమవడం ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా సెలెక్టర్లు భావిస్తున్నారు. గత ఏడాది గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో పంత్ కెప్టెన్సీ చేపట్టినప్పుడు వ్యూహాత్మకంగా మెరుగైన నిర్ణయాలు తీసుకోలేదనే అభిప్రాయం సెలెక్టర్లలో ఉందని సమాచారం. ‘పంత్ లాంటి మ్యాచ్ విన్నర్‌ను టీమిండియా కోల్పోవడానికి వీల్లేదు. అతడు స్వేచ్ఛగా ఆడితేనే జట్టుకు ఎక్కువ ఉపయోగపడతాడు. అదనపు బాధ్యతలు ఉన్నప్పుడు పంత్ బ్యాటింగ్‌పై ప్రభావం పడుతోంది’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి.

ఇక వన్డే జట్టులో రెండో వికెట్ కీపర్ స్థానంపై కూడా తీవ్ర పోటీ నెలకొంది. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగుతుండగా.. ధృవ్ జురెల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కూడా పోటీలో ఉన్నారు. దీంతో రిషభ్ పంత్ స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తానికి గౌహతిలో జరగనున్న ఈ బీసీసీఐ సమావేశం భారత క్రికెట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీ కొనసాగుతుందా?, పంత్‌ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతుతాడా? అనే అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.