BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్‌క్వాలిఫికేషన్!

  • ఇకపై ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఆటలు సాగవు
  • తప్పు చేస్తే సస్పెన్షన్ లేదా డిస్‌క్వాలిఫికేషన్
  • సమస్యలు తలెత్తకుండా బీసీసీఐ ముందస్తు చర్యలు
Bcci New Guidelines

Bcci New Guidelines

BCCI New Guidelines for Players in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటగాళ్లు, జట్టు సిబ్బంది వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా హనీ ట్రాప్ ఘటనలు, లైంగిక ఆరోపణలు వంటి సమస్యలు తలెత్తకుండా బీసీసీఐ ముందస్తు చర్యలు చేపట్టింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఏడు పేజీల ప్రత్యేక మార్గదర్శకాలను పంపారు. ఈ లేఖలో ప్లేయర్స్, జట్టు అధికారుల భద్రత, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

ఐపీఎల్ వంటి హై ప్రొఫైల్ టోర్నీల్లో హనీ ట్రాప్ వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ప్రతి ఫ్రాంచైజీ అప్రమత్తంగా ఉండాలని లేఖలో దేవజిత్ సైకియా ప్రాంచైజీ యాజమాన్యాలకు సూచించారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ప్లేయర్స్ బస చేసే హోటల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం బీసీసీఐ, ఐపీఎల్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. హోటళ్లలో అనధికారికంగా ఎవరికైనా ప్రవేశం కల్పించినట్లయితే.. కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ బోర్డు స్పష్టం చేసింది.

జట్టు ప్లేయర్స్ లేదా సిబ్బంది గదుల్లోకి ఎవరైనా రావాలంటే.. ముందుగా టీమ్ మేనేజర్ అనుమతి తప్పనిసరి అని మార్గదర్శకాల్లో దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కుటుంబసభ్యులు, బంధువులు అయినా కూడా ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సభ్యులు హోటల్ వెలుపలికి వెళ్లే ముందు తప్పనిసరిగా సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ లేదా టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. టోర్నీ సమయంలో వ్యక్తిగత ప్రయాణాల గురించి కూడా టీమ్ మేనేజర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది.

నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా హెచ్చరించారు. షోకాజ్ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్ లేదా టోర్నీ నుంచి డిస్‌క్వాలిఫికేషన్ వంటి శిక్షలు విధించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు ఈ మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయాలని బీసీసీఐ లేఖలో సూచించింది. ఇక మ్యాచ్‌ల సమయంలో ఫ్రాంచైజీ యజమానులు డగౌట్‌లో ఆటగాళ్లు లేదా మేనేజర్లతో నేరుగా మాట్లాడకూడదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ ప్రతిష్టను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు బీసీసీఐ చెప్పుకోచ్చింది.