Site icon NTV Telugu

Rishabh Pant: పంత్‌ నువ్వెప్పుడూ తలొంచకూడదు.. ఎప్పుడూ నవ్వుతూనే ఉండు!

Rishabh Pant

Rishabh Pant

Sunil Gavaskar on Rishabh Pant: ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 67 పరుగుల తేడాతో ఓడింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 267 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ 199 పరుగులకు ఆలౌటైంది. సొంత మైదానంలో భారీ ఓటమిని చవిచూడటంతో.. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్‌ అనంతరం టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్‌తో పంత్ మాట్లాడాడు. ఈ సందర్భంగా నువ్వెప్పుడూ తలొంచకూడదని, ఎప్పుడూ నవ్వుతూనే ఉండు అని పంత్‌తో సన్నీ అన్నాడు.

‘మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 230 లోపు కట్టడి చేసి ఉంటే మ్యాచ్‌ను గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌కు, మాకు ప్రధాన తేడా పవర్‌ ప్లే. వారు దూకుడుగా ఆడటంతో మాపై ఒత్తిడి మ్యాచ్‌ చివరి వరకూ కొనసాగింది. సెకండ్‌ బ్యాటింగ్‌ సమయంలో మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్‌ స్లో అయింది. మేం అనుకున్న విధంగా బంతి రాలేదు. 260-270 పరుగులను ఛేజ్ చేయాల్సి వచ్చినప్పుడు ధాటిగా ఆడాలి. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ఇచ్చిన శుభారంభాన్ని చివరి వరకూ కొనసాగించలేకపోయాం. తీవ్ర ఒత్తిడిలోనూ అతడి ఆటతీరు ఆకట్టుకుంది. పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతాం’ అని రిషబ్ పంత్ అన్నాడు.

Also Read: Aishwarya Rai: ఒక్క పోస్టుతో అందరి నోళ్లు మూయించిన ఐశ్వర్య రాయ్!

రిషబ్ పంత్ వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్‌ స్పందిస్తూ… ‘పంత్‌.. నీ తలను ఎప్పుడూ దించొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐపీఎల్ 2024లో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. తప్పకుండా ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకుంటుందని ఆశిస్తున్నా. నిరాశ పడకు, నువ్ ఎప్పుడూ నవ్వుతూనే ఉండు’ అని అన్నాడు. థ్యాంక్యూ సర్, తప్పకుండా ప్రయత్నిస్తా అని సన్నీతో పంత్ అన్నాడు. ఐపీఎల్ 2024లో 8 మ్యాచులు ఆడిన ఢిల్లీ.. మూడు విజయాలతో పట్టికలో 7వ స్థానంలో ఉంది.

Exit mobile version