IPL vs PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) దెబ్బకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) వణికిపోతోంది. పాకిస్తాన్‌లోని రాజకీయ పరిణామాలు, ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం వల్ల ఆ దేశంలో పీఎస్ఎల్ ఆడేందుకు విదేశీ క్రికెటర్లు భయపడుతున్నారు. ఇక పాకిస్తాన్ తాలిబాన్లు నేరుగా విదేశీ క్రికెటర్లకు, పీఎస్‌ఎల్‌కు వార్నింగ్ ఇచ్చారు. మీరు పీఎస్ఎల్ ఆడేందుకు రావొద్దని, ఒక వేళ వస్తే జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని చెప్పారు.
మరోవైపు, ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ పీఎస్‌ఎల్‌కు లేదు. దీంతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ కాంట్రాక్టులు రద్దు చేసుకుని ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తు్న్నారు. మార్చి 26న పీఎస్ఎల్, మార్చి 28 ఐపీఎల్ టోర్నీలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి రెండు షెడ్యూళ్లు ఒకే సారి రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆందోళనలు పెరిగాయి. నిజానికి పీఎస్ఎల్ జనవరి-మార్చ్ మధ్య జరిగేది. ఐపీఎల్‌తో ఎలాంటి క్లాష్ లేకుండా ఉండేది. అయితే, 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి రావడంతో పీఎస్ఎల్ మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చాల్సి వచ్చింది.
పీఎస్‌ఎల్ నుంచి ఐపీఎల్‌కు క్రికెటర్లు..
నిజానికి 2025 నుంచి పీఎస్ఎల్ ప్లేయర్లు ఐపీఎల్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ కార్బిన్ బాష్ తన పీఎస్ఎల్ కాంట్రాక్ట్ రద్దు చేసుకుని ముంబై ఇండియన్స్‌లో చేరారు. దీంతో ఇతడిపై పీఎస్ఎల్ ఒక ఏడాది బ్యాన్ విధించింది.
ఐపీఎల్ 2026లోకి వలసలు కొనసాగుతున్నాయి.
* బ్లెస్సింగ్ ముజరబాని
ముజరబాని ముందుగా పీఎస్ఎల్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ఆడాల్సి ఉంది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను వదిలిపెట్టిన తర్వాత ఆ స్థానంలోకి ముజరబాని వచ్చారు.
* దాసున్ శనక
దాసున్ శనక లాహోర్ ఖలండర్స్‌కు ఆడాల్సి ఉంది. అయితే, ఇతను సామ్ కరన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడబోతున్నారు.
* స్పెన్సర్ జాన్సన్
క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఆడాల్సిన స్పెన్సన్ జాన్సన్, నాథన్ ఎల్లిస్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడనున్నారు.
* గుడాకేష్ మోతీ
లాహోర్ ఖలండర్స్‌కు ఆడాల్సిన మోతీ లక్నో సూపర్ జాయింట్స్‌లో వానిందు హసరంగా స్థానంలో వస్తున్నాడు.
ఐపీఎల్ క్రేజ్‌కు కారణాలు ఇవే:
పీఎస్‌ఎల్‌తో పోలిస్తే ఐపీఎల్ క్రేజ్ వేరే లెవల్. బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువ. పీఎస్‌ఎల్ కన్నా ఐపీఎల్‌లో ఆడితే ఒక్కో ప్లేయర్ 5 నుంచి 10 రెట్లు డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు ముజరబానీకి పీఎస్ఎల్‌లో రూ. 36 లక్షలు వస్తుంటే, ఐపీఎల్ దాదాపుగా రూ. 1.5 కోట్లు ఆఫర్ చేసింది. ఇవన్నీ కూడా పీసీబీలో భయాలను పెంచుతున్నాయి. ఐపీఎల్ క్రేజ్, మనీ పవర్ ముందు పీఎస్ఎల్ నిలవలేకపోతోంది.
