‘టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అనే సామెత ఉంది. టాలెంట్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చినప్పుడే విజయం సాధిస్తారు అని పెద్దలు అంటున్నారు. ఇది భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ కార్తిక్ శర్మ, అకిబ్ దార్ విషయంలో నిజమైంది. ఇటీవల దేశీయ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వీరికి ఐపీఎల్ ఆడే అవకాశం రావడమే కాదు.. కోట్లలో డబ్బు కూడా రానుంది. అబుదాబి వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో కార్తిక్ శర్మకు రూ.14.20 కోట్లు, అకిబ్ దార్‌కు రూ.8.40 కోట్లు దక్కాయి.
కార్తిక్ శర్మ:
కార్తిక్ శర్మ కనీస ధర రూ.30 లక్షలు కాగా.. రూ.14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సొంతం చేసుకుంది. కార్తిక్ కోసం సీఎస్‌కేతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) పోటీపడ్డాయి. ముందుగా ముంబై, లక్నో పోటీపడగా.. కేకేఆర్ కూడా బిడ్ వేసింది. రూ.3 కోట్ల వద్ద సీఎస్‌కే ఎంటర్ అయింది. ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే అస్సలు తగ్గేదేలే అన్నట్లు బిడ్ పెంచుకుంటూ పోయాయి. చివరకు రూ.14.20 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది.
లోయర్ ఆర్డర్‌లో భారీ హిట్టింగ్ చేయడం 19 ఏళ్ల కార్తీక్ శర్మ ప్రత్యేకత. కార్తీక్ హిట్టింగ్ పలు జట్లను ఆకర్షిచింది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కార్తీక్ గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. 12 మ్యాచ్‌ల్లో 334 పరుగులు చేశాడు. ఇందులో 28 సిక్సర్లు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ జట్టుకు కార్తీక్ ఫినిషర్‌గా ఉన్నాడు. గతంలో కెవిన్ పీటర్సన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు అతడి ఆటను ప్రశంసించారు.
Also Read: IPL Auction 2026: నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డ చెన్నై, హైదరాబాద్.. అనామక ఆటగాడికి 14 కోట్లు!
అకిబ్ దార్:
ఐపీఎల్ 2026 మినీ వేలంలో జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీ దార్‌కు మంచి ధర పలికింది. అతడి కనీస ధర రూ.30 లక్షలు కాగా.. రూ.8.40 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.అతడి కోసం పోటీపడ్డ ఢిల్లీ, ఎస్‌ఆర్‌హెచ్ పోటీపడ్డాయి. ముందుగా ఢిల్లీ, రాజస్థాన్ పోటీ పడగా.. బెంగళూరు కూడా బిడ్ వేసింది. రూ.1.10 కోట్ల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ ఎంట్రీ ఇచ్చింది. అకిబ్ కోసం ఢిల్లీ, ఎస్‌ఆర్‌హెచ్ బిడ్ పెంచుకుంటూ పోయాయి. చివరకు ఎస్‌ఆర్‌హెచ్ వెనక్కి తగ్గగా.. ఢిల్లీ కైవసం చేసుకుంది.
ఆకిబ్ నబీ దేశీయ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. స్వింగ్ బౌలర్ ఆకిబ్ తన బౌలింగ్‌లో మెరుగయ్యాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మంచి గణాంకాలు నమోదు చేస్తున్నాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో 7 మ్యాచ్‌ల్లో 13.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలకు అతడు నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ అతడికి తుది జట్టులో ఛాన్స్ ఇవ్వనుంది.
