ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో దేశవాళీ ఆటగాడు ప్రశాంత్ వీర్‌పై కాసుల వర్షం కురిసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ కనీస ధర రూ.30 లక్షలు కాగా.. రూ.14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సొంతం చేసుకుంది. 20 ఏళ్ల ప్రశాంత్ కోసం సీఎస్‌కేతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) పోటీ పడ్డాయి. ప్రశాంత్ కోసం ముందుగా ముంబై ఇండియన్స్ బిడ్ వేయగా.. ఆపై లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. 1.3 కోట్ల వద్ద సీఎస్‌కే ఎంట్రీ ఇవ్వగా.. రాజస్థాన్ రాయల్స్ కూడా రేసులోకి వచ్చింది. 6.8 కోట్ల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ ఎంట్రీ ఇవ్వడంతో రాజస్థాన్ వెనక్కి తగ్గింది.
ప్రశాంత్ వీర్ కోసం సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. దాంతో అతడి ధర 10 కోట్లు దాటేసింది. చివరకు 14.20 కోట్లకు సీఎస్‌కే దక్కించుకుంది. దాంతో ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా ప్రశాంత్ రికార్డుల్లో నిలిచాడు. అంతకుముందు టీమిండియా పేసర్ అవేష్ ఖాన్ రూ.10 కోట్లకు అమ్ముడయ్యాడు. అంతేకాదు ఇప్పటివరకు అమ్ముడైన వారిలో అత్యధిక ధర పలికిన భారతీయుడిగా కూడా వీర్ నిలిచాడు.
Also Read: Matheesha Pathirana IPL Price: పోటీపడ్డ ఢిల్లీ, లక్నో, కోల్‌కతా.. మతీశాకు మతిపోయే ధర!
ప్రశాంత్ వీర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. యూపీ టీ20 లీగ్ ద్వారా అతడు వెలుగులోకి వచ్చాడు. 2025-26 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ప్రశాంత్ రాణించాడు. 7 మ్యాచ్‌లలో 112 పరుగులు చేయడమే కాకుండా.. 9 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో సీఎస్‌కే అతన్ని ట్రయల్స్‌కు ఆహ్వానించింది. అతడి ఆటకు సీఎస్‌కే మేనేజ్మెంట్ ఫిదా అయింది. రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా ప్రశాంత్ వీర్‌ను జట్టులోకి తీసుకుంది. జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
