Site icon NTV Telugu

IPL 2026-KKR: ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో డువాన్.. కేకేఆర్‌కు పండగే ఇగ!

Duan Jansen Ipl 2026

Duan Jansen Ipl 2026

ఐపీఎల్‌ 2026 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్) భారీ ధరకు కొనుగోలు చేసిన బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజూర్‌ రహ్మాన్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 2025 డిసెంబర్‌ 16న అబూదాబీలో జరిగిన వేలంలో ముస్తాఫిజూర్‌ను రూ.9.20 కోట్లకు కేకేఆర్‌ దక్కించుకుంది. అయితే వేలం ముగిసిన కొద్ది రోజులకే అంతా మారిపోయింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలు, హత్యల నేపథ్యంలో ముస్తాఫిజూర్‌ విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఏఎన్‌ఐతో మాట్లాడుతూ ధృవీకరించారు.

ముస్తాఫిజూర్‌ రహ్మాన్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌ యాజమాన్యంకు బీసీసీఐ బోర్డు ఆదేశించిందని దేవజిత్‌ సైకియా తెలిపారు. అదే సమయంలో కేకేఆర్‌కు ఊరట కలిగించే మరో అంశాన్ని కూడా బీసీసీఐ వెల్లడించింది. ముస్తాఫిజూర్‌ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసుకునేందుకు కేకేఆర్‌కు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో కేకేఆర్ ఫ్రాంచైజీ సరైన రీప్లేస్‌మెంట్‌ కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో మాజీ కేకేఆర్‌, బెంగాల్‌ వికెట్‌కీపర్‌-బ్యాటర్‌ శ్రీవత్స గోస్వామి ఆసక్తికర సూచన చేశారు. దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ డువాన్‌ జాన్సెన్‌ను ముస్తాఫిజూర్‌కు సరైన ప్రత్యామ్నాయంగా పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించారు.

శ్రీవత్స గోస్వామి మాట్లాడుతూ… ‘మార్కో జాన్సెన్‌ సోదరుడు డువాన్‌ జాన్సెన్‌ కేకేఆర్‌కు మంచి ఎంపిక. అంతేకాదు బ్యాటింగ్‌లో కూడా మెరుగ్గా రాణించగలడు’ అని పేర్కొన్నాడు. డువాన్‌ జాన్సెన్‌ దక్షిణాఫ్రికా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌కు సోదరుడు. ఇప్పటికే అతడికి 2023 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడిన అనుభవం ఉంది. ప్రస్తుతం 25 ఏళ్ల డువాన్‌ 2025-26 సీజన్‌లో దక్షిణాఫ్రికా లీగ్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టీ20 క్రికెట్‌లో అతడు మంచి రికార్డులు కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 48 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతడు 46 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు బ్యాటుతో 329 పరుగులు చేశాడు. ముస్తాఫిజూర్‌ స్థానంలో డువాన్‌ జాన్సెన్‌ను తీసుకుంటే కేకేఆర్‌కు బౌలింగ్‌తో పాటు లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌లోనూ బలం చేకూరే అవకాశం ఉందని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కేకేఆర్‌ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version