NTV Telugu Site icon

రన్‌ మిషిన్‌ విరాట్‌ కోహ్లీకి ఏమైంది…?

టీమిండియా కెప్టెన్‌, రన్‌ మిషిన్‌ విరాట్‌ కోహ్లీకి ఏమైంది ? వరుసగా టెస్టుల్లో ఎందుకు విఫలమవుతున్నాడు ? హాఫ్‌ సెంచరీ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నాడా ? కెప్టెన్‌గా ఒత్తిడిని ఎదుర్కొలేక…బ్యాట్స్‌మెన్‌గా ఫెయిల్‌ అవుతున్నాడా ?

విరాట్‌ కోహ్లీ…టీమిండియా టాప్‌ బ్యాట్స్‌మెన్‌. టెస్టులైనా, వన్డేలైనా, టీ20 మ్యాచులయినా…అద్భుతంగా బ్యాటింగ్‌ చేయడంతో కోహ్లీకి సాటిరారు. అలాంటి బ్యాట్స్‌మెన్‌ కొంతకాలంగా బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. అర్ధసెంచరీ సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. చిన్నా పెద్ద టీమ్‌లు అన్న తేడా లేకుండా…భారీ స్కోరు చేయలేక పెవిలియన్‌ చేరుతున్నాడు. 2019లో చివరి సారి సెంచరీ సాధించాడు. అది కూడా పసికూన బంగ్లాదేశ్‌పై 136 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.

2014లో హాఫ్‌ సెంచరీ చేసేందుకు 10 ఇన్నింగ్స్‌లు ఆడాడు, 2015లో 8 ఇన్నింగ్స్‌, 2016, 2017 సంవత్సరాలో 7 ఇన్నింగ్స్‌ చొప్పున తీసుకున్నాడు. 2021లో 7 ఇన్నింగ్స్‌లు ఆడితే…ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన కోహ్లీ…స్వల్ప స్కోరుకు ఔటవుతున్నాడు. సహచరుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన నాయకుడు…తానే ధైర్యాన్ని కోల్పోతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేశాడు. అయితే ఇందులో హయ్యస్ట్‌ స్కోరు 44 పరుగులు మాత్రమే. వరుసగా విఫలమవుతుండటంతో…కోహ్లీకి ఏమైందంటూ స్పోర్ట్స్‌ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.