Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..

Sunil Gavaskar

Sunil Gavaskar

Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌ 2026 సంచలనం, భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం మరోసారి వాయిదా పడింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కూడా అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరోసారి బేబీ బాస్‌ బెంచ్‌కే పరిమితమైన నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైభవ్‌కు అవకాశం ఇవ్వడంలో మరింత ఆలస్యం చేస్తే అతనిపై అంచనాల ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు గవాస్కర్..

లేట్‌ చేస్తే ఇదే జరుగుతుంది..?

ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ మరోసారి సంజు శాంసన్‌, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లతో కూడిన ఓపెనింగ్ కాంబినేషన్‌పైనే విశ్వాసం ఉంచింది. దీంతో భారత జట్టులో ఎంపికైన తర్వాత వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడోసారి తుది జట్టుకు దూరమయ్యాడు. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో కూడా అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ విషయంపై మాట్లాడిన గవాస్కర్, అవకాశం కోసం ఎక్కువ కాలం ఎదురుచూడాల్సి వస్తే యువ ఆటగాడిపై సహజంగానే అంచనాలు పెరుగుతాయని అన్నారు. అరంగేట్రం చేసే సమయంలో తనను వెంటనే నిరూపించుకోవాలనే భావన అతనిలో ఏర్పడుతుందని పేర్కొన్నారు. అయితే 15 ఏళ్ల వయసులో ఉన్న వైభవ్ ఒత్తిడిని పెద్దగా పట్టించుకోకుండా తన సహజ ఆటను ప్రదర్శించే సామర్థ్యం కలిగి ఉన్నాడనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు.

వైభవ్‌కు మంచి అవకాశం..!

గవాస్కర్ అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం వైభవ్‌కు లభిస్తున్న అతిపెద్ద ప్రయోజనం భారత జట్టుతో కలిసి ప్రయాణించడం. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కలిసి ఉండటం, వారి ఆటతీరును దగ్గరగా గమనించడం, డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణాన్ని ఆస్వాదించడం వంటి అంశాలు యువ క్రికెటర్ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ అనుభవం భవిష్యత్తులో అతని కెరీర్‌కు బలమైన పునాది అవుతుందని వివరించారు గవాస్కర్‌… కాగా, అద్భుతమైన ఐపీఎల్ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా భారత జట్టులో చోటు సంపాదించాడు. అతని దూకుడు బ్యాటింగ్, రికార్డు స్థాయి ఇన్నింగ్స్‌లతో ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్ పర్యటనలోనే అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అభిమానులు భావించినప్పటికీ, ఇప్పటివరకు ఆ అవకాశం మాత్రం రాలేదు.

ఇదిలా ఉంటే, చెస్టర్-లె-స్ట్రీట్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ తొలుత కష్టాల్లో పడింది. కేవలం రెండు ఓవర్లలోనే ఆరు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్‌ను సాకిబ్ మహమూద్ ఔట్ చేయగా, అభిషేక్ శర్మతో జరిగిన అపార్థం కారణంగా ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఎదురుదాడికి దిగుతూ కేవలం 24 బంతుల్లో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ క్రమంలో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో శివమ్ దూబే అజేయంగా 42 పరుగులు చేసి భారత్‌ను 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల వరకు తీసుకెళ్లాడు.

ఇంగ్లాండ్ తరఫున సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైన తర్వాత వర్షం తీవ్రత పెరగడంతో మ్యాచ్‌ను కొనసాగించడం సాధ్యపడలేదు. చివరకు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయడంతో పోరు డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. మరోవైపు.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, రాబోయే మ్యాచ్‌ల్లో అయినా అతనికి అవకాశం లభిస్తుందా లేదా అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.