Shreyas Iyer: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. భారత బ్యాటింగ్ విభాగం పూర్తిగా కుప్పకూలడంతో న్యూజిలాండ్ ఏకంగా 244 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు తొలిసారిగా వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో భారత కెప్టెన్లుగా తమ తొలి వన్డే, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఓటమి ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సరసన శ్రేయస్ అయ్యర్ కూడా చేరాడు.
89 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 333 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 26.4 ఓవర్లలో కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టు న్యూజిలాండ్‌పై వన్డేల్లో చేసిన అత్యల్ప స్కోరు 88 పరుగులు. 2010లో దంబుల్లాలో నమోదైన ఈ చెత్త రికార్డును భారత్ తృటిలో తప్పించుకుంది. న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీ భారత బ్యాటింగ్‌ను చెల్లాచెదురు చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను డకౌట్ చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్‌లో హెన్రీ 27 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత కైల్ జేమీసన్ కూడా భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. సిరీస్‌లో తన తొలి వన్డే ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్‌ను 5 పరుగులకే ఔట్ చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాబోయే టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో రుతురాజ్ జట్టులోకి వచ్చాడు. దీంతో భారత్ 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి వరకు కోలుకోలేక భారీ ఓటమిని మూటగట్టుకుంది.
కోహ్లీ, గిల్ సరసన శ్రేయస్ అయ్యర్
భారత వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సరసన నిలిచాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లకు భారత కెప్టెన్లుగా తమ తొలి వన్డే, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఓటములే ఎదురయ్యాయి. శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి వన్డే కెప్టెన్సీ మ్యాచ్. అంతకుముందు 2026 జూన్ 26న బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన తన తొలి టీ20 మ్యాచ్‌లోనూ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పుడు తొలి వన్డే కెప్టెన్సీలోనూ పరాజయం ఎదురవడంతో ఈ జాబితాలో చేరాడు.
కోహ్లీకి కూడా తొలి మ్యాచ్‌ల్లో ఓటములే!
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అరంగేట్రం కూడా ఓటమితోనే ప్రారంభమైంది. 2013 జూలై 2న కింగ్‌స్టన్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలిసారిగా వన్డే కెప్టెన్‌గా వ్యవహరించగా భారత్ ఓడిపోయింది. అలాగే 2017 జనవరి 26న కాన్పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్‌గా తొలి ఓటమిని చవిచూశాడు. టెస్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా చేతిలో అడిలైడ్‌లో 48 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.
శుభ్‌మన్ గిల్‌కు కూడా తప్పని పరాజయాలు
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ ప్రయాణం కూడా ఓటములతోనే మొదలైంది. 2024 జూలై 6న హరారేలో జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో తొలిసారిగా భారత కెప్టెన్‌గా వ్యవహరించగా భారత్ 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. టెస్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదురైంది. నాలుగో ఇన్నింగ్స్‌లో 372 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించింది. ఇక 2025 అక్టోబర్ 19న పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి వన్డే కెప్టెన్సీ మ్యాచ్‌లోనూ భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
న్యూజిలాండ్ భారీ స్కోరుకు విల్ యంగ్ కారణం
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించడంలో విల్ యంగ్ కీలక పాత్ర పోషించాడు. అతను 108 బంతుల్లో 125 పరుగులతో అద్భుత సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 48 బంతుల్లో 58 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం మిగతా బ్యాటర్లు కూడా కీలక పరుగులు జోడించడంతో న్యూజిలాండ్ 333 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 69 పరుగులిచ్చి 2 వికెట్లు, ఔకిబ్ నబీ 59 పరుగులిచ్చి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 39 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. అయితే న్యూజిలాండ్ భారీ స్కోరును అడ్డుకోవడంలో భారత బౌలర్లు పూర్తిగా విజయవంతం కాలేకపోయారు. అయితే, నాలుగో వన్డేలో ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండటంతో సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం భారత్‌కు ఇంకా ఉంది. మరోవైపు న్యూజిలాండ్ చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. దీంతో చివరి వన్డేపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

