Site icon NTV Telugu

IND Vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా శిఖర్ ధావన్

Shikar Dhawan 1

Shikar Dhawan 1

IND Vs SA: ఆసియా కప్‌లో ఘోర వైఫల్యంతో సూపర్4 దశలో ఇంటి ముఖం పట్టిన టీమిండియా టీ20 ప్రపంచకప్ సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో వరుసగా మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో ఆస్ట్రేలియాతో మూడు టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మూడు వన్డేల సిరీస్‌లో కూడా తలపడనుంది. అయితే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్‌ నుంచి కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ అప్పగించాలని భావిస్తోంది. అంతేకాకుండా ఈ సిరీస్‌కు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు పగ్గాలు అప్పగించనుంది.

Read Also: Gaddar : ఎర్ర మందారం కలర్‌ మారుతుందా..?

కాగా టీ20 ప్రపంచకప్‌కు కీలక బౌలర్లు బుమ్రా, హర్షల్ పటేల్ అందుబాటులోకి రానున్నారని తెలుస్తోంది. మరి వీరిద్దరూ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో ఆడతారా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ప్రపంచకప్‌కు గాయం కారణంగా దూరంగా ఉంటాడని తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 20న మొహాలీలో ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి టీ20 ఆడనుంది. సెప్టెంబర్ 23న రెండో టీ20 నాగపూర్‌లో, సెప్టెంబర్ 25న మూడో టీ20 హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఇప్పటికే జట్టును ప్రకటించగా టీమిండియా ప్రకటించాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్‌లో ఆడే ఆటగాళ్లందరూ ఈ సిరీస్‌లో ఆడతారని తెలుస్తోంది.

Exit mobile version