Indian Women Cricket Team Must Win Against Barbados To Go In Semi Finals: బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా జరుగుతోన్న మహిళల క్రికెట్‌లో భారత జట్టు ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడింది. గెలవాల్సిన తొలి మ్యాచ్‌ను చేజేతులా వదులుకోగా.. రెండో మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి.. పాకిస్తాన్ జట్టుని చిత్తుచేసింది. ఇప్పుడు బార్బడోస్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. భారత్ సెమీస్‌లో తన బెర్తు కన్ఫమ్ చేసుకోవాలంటే, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ మ్యాచ్ గెలవాల్సిందే! లేకపోతే, ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.
గ్రూప్-ఏలో మొత్తం నాలుగు జట్లు ఉన్నాయి. అవి ఆస్ట్రేలియా, భారత్, బార్బడోస్, పాకిస్తాన్. రెండు విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టు.. 4 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉండటమే కాదు, సెమీస్‌లో తన బెర్తుని దాదాపు ఖరారు చేసుకుంది. పాకిస్తాన్‌కి పాయింట్స్ దక్కకపోవడంతో ఇంటిదారి పట్టింది. భారత్, బార్బడోస్ జట్లు చెరో రెండు పాయింట్స్ కలిగి ఉన్నాయి. సెమీస్‌లో రెండో బెర్తు కోసం ఈ రెండు జట్లే మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారో, వాళ్లే సెమీస్‌కి అర్హత పొందుతారు. భారత్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. బార్బడోస్ జట్టుని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే, ఈ జట్టు పాకిస్తాన్‌నే ఓడించి అందరినీ షాక్‌కి గురి చేసింది.
నిజానికి.. బార్బడోస్ టీమ్ క్రికెట్ అభిమానులకు అంతగా పరిచయం లేని పేరు. పెద్దగా సత్తా చాటదని అంతా భావించారు. కానీ.. 144 పరుగులతోనే పాక్‌పై గెలుపొంది, ఝలకిచ్చింది ఈ టీమ్. ఆ జట్టు బౌలర్లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. కాబట్టి.. బార్బడోస్ బౌలింగ్‌ను భారత క్రికెటర్లు తక్కువ అంచనా వేయకూడదు. లైట్ తీసుకుంటే మాత్రం బోర్లాపడటం ఖాయం. ఆ జట్టులో కెప్టెన్ హేలీ మాథ్యూస్, షెకెరా బౌలింగ్‌లో అదరగొడుతున్నారు. ఆ ఇద్దరినీ సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే, బార్బడోస్‌పై పైచేయి సాధించినట్టే! మరి.. మన ఇండియన్స్ ఎలా రాణిస్తారో చూడాలి. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 10.30 గంటలకు జరగనుంది.