Indian Car Racing League Cancelled In Hyderabad: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా కార్ రేసింగ్ లీగ్‌ను అర్థాంతరంగా రద్దు చేశారు. ఈరోజు సాయంత్రం క్వాలిఫయింగ్ రేస్‌లో భాగంగా రెండు కార్లు ఢీకొనడం, ఈ ప్రమాదంలో ఒక మహిళా రేసర్ గాయపడటంతో.. రేసు ఆలస్యమైంది. దీనికితోడు చీకటి పడటంతో.. ఎలాంటి రేస్‌లు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. కేవలం ఫార్ములా-4 రేస్‌తోనే సరిపెట్టేశారు. ఇక్కడి రేసింగ్ ట్రాక్‌లో ఈ లీగ్ నిర్వహణకు కేవలం రెండు రోజుల మాత్రమే అనుమతి ఉండటంతో.. ఈ రేసు కొనసాగించేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో.. ఈ కార్ రేసింగ్ లీగ్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
కాగా.. తొలిరోజు ఈ ఇండియన్ కార్ రేసింగ్ లీగ్ విజయవంతంగా సాగింది. కానీ.. రెండో రోజు (20-11-22) మాత్రం ఐదు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒక ఘటనలో రెండు కార్లు ఢీకొనడంతో.. ఒక మహిళా రేసర్‌గా బాగానే గాయాలయ్యాయి. చెన్నై టర్బో రైడర్స్ టీమ్‌కు చెందిన కారును గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన రేసర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. అటు.. మిగిలిన నాలుగు ప్రమాదాల్లోనూ రేసర్లకు చిన్న చిన్న గాయాలయ్యాయి. కొన్ని కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ కార్ రేసింగ్ చాలా రిస్క్‌తో కూడకున్నది కాబట్టి.. ఈ లీగ్ సందర్భంగా రేసింగ్ ట్రాక్ చుట్టూ 15 అడుగుల మేర ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్ వేదికగా ఫార్ములా-ఈ రేసింగ్ జరగనుంది. దానికి ఈ ఇండియర్ కార్ లీగ్ పోటీలను ట్రయల్ రన్‌గా భావించారు. అయితే.. ప్రమాదాలు చోటు చేసుకోవడం వల్ల రేసు ఆలస్యం అవ్వడం, చీకటి పడటంతో ఇతర రేసింగ్స్ నిర్వహించేందుకు వీలు లేని పక్షంలో దీన్ని రద్దు చేయాల్సి వచ్చింది.