India Won Second T20I Match Against New Zealand: ఈరోజు బే ఓవల్ స్టేడియంలో న్యూజీల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ భారత్ ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపించింది. సూర్యకుమార్ యాదవ్ శతకంతో చెలరేగడంతో, కివీస్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ వేస్తూ వికెట్లు పడగొట్టడంతో.. న్యూజీలాండ్ జట్టు చతికిలపడింది. భారత్ కుదిర్చిన లక్ష్యాన్ని చేధించలేక కుప్పకూలింది. దీంతో.. భారత్ ఏకంగా 65 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో భారత్ పైచేయి సాధించింది.
తొలుత టాస్ గెలిచిన న్యూజీలాండ్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు భారత్ రంగంలోకి దిగింది. అయితే.. ఓపెనర్లు భారత్‌కి ఆశించిన స్థాయిలో శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. తనని ఓపెనర్‌గా పంపడంతో.. రిషభ్ చెలరేగుతాడని అనుకుంటే, 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ (36) పర్వాలేదనిపించి, ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 111) మాత్రం తాండవం చేశాడు. క్రీజులోకి వచ్చిన మిగతా బ్యాటర్లు అతనికి మద్దతు ఇవ్వడంతో.. సూర్య తన 360 డిగ్రీ ఆటతో మైదానంలో పరుగులు వర్షం కురిపించాడు. కివీస్ బౌలర్లు అతడ్ని ఔట్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఎలాంటి బంతులు వేసినా సరే, వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని బాదేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా, సూర్య మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా విశ్వరూపం చూపించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్‌కి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఫిన్ అలెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కాన్వే, కేన్ కలిసి బాగానే రాణించారు. కానీ ఎప్పుడైతే కాన్వే వికెట్ పడిందో, అప్పటినుంచి కివీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. కేన్ విలియమ్సన్ (51 బంతుల్లో 61) ఒక్కడే చివరివరకు ఒంటరి పోరాటం కొనసాగించాడు. మిగిలిన వాళ్లెవరకు భారత బౌలర్ల ధాటికి క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. దీంతో 126 పరుగులకే కివీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో దీపక్ హుడా 4 వికెట్లు తీయగా.. చాహల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు.. భువనేశ్వర్, సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.
