NTV Telugu Site icon

IND Vs WI: నేడు మూడో వన్డే.. క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి..!!

Shikar Dhawan

Shikar Dhawan

IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా నేడు భారత్-వెస్టిండీస్ మధ్య నామమాత్రపు మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే రెండు వన్డేలలో గెలిచి సిరీస్ గెలిచిన టీమిండియా మూడో వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. అయితే మూడో వన్డేలో జట్టులో పలు మార్పులు జరగనున్నాయి. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ లైనప్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా బౌలింగ్‌లో మార్పులు తప్పనిసరిగా కనిపిస్తోంది. అవేష్ ఖాన్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ఆడే ఛాన్స్ ఉంది. తొలి వన్డేలో ప్రసిధ్‌ కృష్ణ, రెండో వన్డేలో అవేష్ ఖాన్ దారుణంగా విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా తొలి రెండు వన్డేల్లో ఆడలేదు. దీంతో మూడో వన్డేలో అయినా ఆడతాడో లేదో చూడాలి. ఒకవేళ ఆడితే ఎవరి స్థానం భర్తీ చేస్తాడన్న విషయం ఆసక్తికరంగా మారింది. జడేజా కోసం ప్రధాన స్పిన్నర్ చాహల్‌ను తప్పిస్తారా లేదా రెండో వన్డేలో గెలుపు రుచి చూపించిన అక్షర్‌పటేల్‌ను తప్పిస్తారా అన్నది వేచి చూడాలి.

Read Also:5G Auction: ‘5జీ’ వేలానికి సూపర్‌ రెస్పాన్స్‌.. తొలిరోజే ఇలా..

మరోవైపు జట్టులో సమర్థులైన ఆటగాళ్లు ఉన్నా వెస్టిండీస్ వరుస ఓటములకు కారణాలను అన్వేషిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్‌ చేతిలోనూ విండీస్ వరుసగా మూడు వన్డేల్లో ఓడింది. ఇప్పుడు టీమిండియాతో తొలి రెండు వన్డేల్లో అదే ఫలితం. హోప్, పూరన్, మేయర్స్, రోమన్ పావెల్‌పై విండీస్ అతిగా ఆధారపడుతోంది. ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలున్నాయి. బౌలింగ్ విభాగంలోనూ విండీస్ తేలిపోతోంది. ఆ జట్టుకు పేస్ బౌలింగ్ వనరులు బాగానే ఉన్నా స్పిన్ విభాగంలో బలహీనంగా కనిపిస్తోంది. మరి మూడో వన్డేలో ఆ జట్టు బౌలర్లు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతారో చూడాల్సిందే. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ డీడీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.